టీ-టీడీపీకి రెండు మార్గాలు చెప్పిన బాబు...!

టీడీపీ అధినేత కమ్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ టీడీపీ పెద్ద సమస్యగా మారింది. ఆయనకే కాదు టీడీపీ నాయకులకూ సమస్యగానే ఉంది. వచ్చే ఎన్నికలనాటికి పార్టీ మళ్లీ నిలదొక్కుకోవాలి. ఎన్నికల్లో విజయం సాధించాలి. అందుకు ఏం చేయాలి? ఇదే ఎవ్వరికీ అర్థంగాని విషయం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని నాయకులు పైకి గొప్పగా చెప్పుకుంటున్నారుగాని అదయ్యే పని కాదని రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి చెబుతోంది. పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలారు. ప్రజాప్రతినిధులుకాని సీనియర్‌ నాయకులు అనేకమంది ఉన్నారు. కాని అందరిలోనూ ఏదో రకమైన అసంతృప్తి. ఏం చేయాలో తెలియని స్థితి. 

మోత్కుపల్లి నరసింహులువంటి నాయకులకు పదవి రాలేదని నిరాశ. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. రెండు గంటలపాటు చర్చించారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా మిగిలినవారంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయిన పరిస్థితిలో పార్టీ ఉనికిని  కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న నాయకుల్లో ఉత్సాహం నింపి, నిరాశను పారదోలాల్సిన బాబు వారితో 'కటువు'గా మాట్లాడారట...! అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే పుల్ల విరిచినట్లు మాట్లాడారు. చంద్రబాబుదంతా కార్పొరేట్‌ శైలి కదా. 

సమావేశానికి హాజరయ్యేముందే అందరు నాయకుల 'పనితీరు' నివేదికలు తయారుచేసుకొని వచ్చారు. వాటిని ముందు పెట్టుకొని క్లాసులు పీకారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే...పార్టీ సారథులైన అధ్యక్షుడు ఎల్‌. రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పనితీరు బాగాలేదట...! పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను వారు సాధించలేకపోతున్నారని బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రమణ సైలెంటుగానే ఉంటున్నా రేవంత్‌ రెడ్డి మాటల దాడిలో వయ్‌లెంట్‌గానే ఉన్నారు. ఆయన ప్రతి రోజు మీడియాలో కనబడుతున్నారు. వినబడుతున్నారు. 

ఒకప్పుడు కేసీఆర్‌ మీద ఒంటికాలిపై లేచిన పలువురు నాయకులు ఇప్పుడు మౌనంగా ఉన్న నేపథ్యంలో రేవంత్‌ చెలరేగిపోతున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. టీడీపీ ఉనికిని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రేవంత్‌ యాక్టివ్‌గా వ్యవహరిస్తుండటం కొందరు నాయకులకు మింగుడుపడటంలేదు కూడా.  ఇంత చురుగ్గా ఉన్న రేవంత్‌ పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడం విచిత్రంగా ఉంది. చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకున్నందుకే కదా 'ఓటుకు నోటు' కేసులో ఇరుక్కుని  జైలుకెళ్లాడు. అయినా  కేసీఆర్‌ను సవాలు చేస్తూ పార్టీ ఉనికిని చాటుతున్నాడు. 

అయినప్పటికీ బాబు మంచి మార్కులేయలేదు. రాష్ట్రంలో పార్టీకి బలమైన కేడర్‌ ఉన్నా నాయకుల పనితీరు కారణంగానే పార్టీ బలపడటంలేదనేది బాబు అభిప్రాయం. చివరకు ఆయన పార్టీ నాయకులతో 'మీకు రెండు మార్గాలున్నాయి. కష్టపడి పనిచేయడం లేదా నాశనం చేయడం' అని సెలవిచ్చారు. అసలే రాష్ట్రంలో పార్టీ అంపశయ్య మీద ఉన్న స్థితిలో బాబు ఇంత కటువుగా మాట్లాడితే నాయకులపై ప్రతికూల ప్రభావం పడదా?  అంతో ఇంతో పనిచేస్తున్న రేవంత్‌ వంటి నాయకులనే ఇలా అంటే పార్టీతో సంబంధం లేకుండా వ్యవహరిస్తూ, బాబుకు ఇబ్బంది కలిగించే పనులు చేస్తున్న  ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్యను ఏమనాలి? టీడీపీ నాయకుల్లో ఇప్పటికీ చాలామందికి టీఆర్‌ఎస్‌ నుంచి ఆఫర్లున్నాయి. 

ఇప్పుడున్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకటవీరయ్య జారిపోయే అవకాశముందని అప్పుడప్పుడు వార్తలొస్తున్నాయి. రేవంత్‌ మీదా పుకార్లు వస్తూనేవున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. బాబు నాయకులపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, బాబు తెలంగాణ టీడీపీని పట్టించుకోవడంలేదని నాయకులంటున్నారు.

దీనిపై బాబు మాట్లాడుతూ ఇకనుంచి తానుగాని, కుమారుడు లోకేష్‌గాని తెలంగాణ వ్యవహారాలు చూసుకుంటామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని, నెరవేర్చని హామీలపై నిలదీయాలని గీతోపదేశం చేశారు. మరి ఆంధ్రాలో ఇదే పని ప్రతిపక్షాలు చేస్తుంటే సహించలేకపోతున్నారు. ప్రతిపక్షాలను అభివృద్ధి నిరోధకులని ముద్ర వేస్తున్నారు. ప్రతిపక్షంగా తెలంగాణలో పోరాడాలి. ఆంధ్రలో అధికారపక్షంగా పోరాటాలను అణచేయాలన్నమాట...!

Show comments