'అతి సర్వత్ర వర్జయేత్' అన్నారు పూర్వకాలపు పెద్దలు. అంటే 'ఓవరాక్షన్ వద్దు నాయనా. సహజంగా ఉండండి' అని అర్థం. అతి ఎప్పుడూ ప్రమాదకరమే. తిండి తినడంలో, ప్రవర్తనలో, డబ్బు ఖర్చు చేయడంలో, మాట్లాడటంలో...ఒకటి రెండు కాదు, ఏ విషయంలోనైనా మితంగా ఉంటేనే మంచిది. వినయం చూపించాలి. కాని అతి వినయం మంచిది కాదు. దీన్నే నక్క వినయమని కూడా అంటారు. అంటే కొందరు పైకి వినయం నటిస్తూనే వెనకనుంచి గోతులు తవ్వుతారు. దేవుడిపట్లనైనా, మనకు ఉపాధి కల్పించి పోషించే యజమానిపట్లనైనా, మన మేలు కోరేవారి పట్లనైనా మనకు భక్తి ఉండాలి. గౌరవం ఉండాలి. కాని అది శృతి మించకూడదు. కొందరికి 'రాజును మించిన రాజభక్తి' ఉంటుంది. ఇలాంటివారు పావలాకు రూపాయి యాక్షన్ చేస్తుంటారు.
సినిమాల్లో ఓవరాక్షన్ చేస్తే సినిమా ఎలా పాడైపోతుందో రాజకీయాల్లోనూ ఓవరాక్షన్ చేస్తే భవిష్యత్తు చీకటవుతుంది. పార్టీ అధినేత మెప్పుకోసం 'అతి' చేస్తారు నాయకులు. ఒక్కోసారి అది వికటిస్తుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పుకోవల్సి వచ్చిందంటే...తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి కమ్ ముఖ్యమంత్రి అయిన 'అమ్మ' జయలలిత మెప్పు కోసం ఓ మహిళా ఎంపీ ఓవరాక్షన్ చేసి శిక్షకు గురైంది. తమిళ సినిమాల్లో, అక్కడి రాజకీయాల్లో ఓవరాక్షన్ సాధారణం. ద్రవిడ పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేల్లో నాయకులంతా మహాభక్తిపరులు. ఈ భక్తి దేవుడి మీద కాదు. అధినేతల మీద. అందులోనూ అన్నాడీఎంకేలో అధినేత పట్ల భక్తిప్రపత్తులు పతాకస్థాయిలో ఉంటాయి.
ఒకప్పుడు తెలంగాణలో ఫ్యూడల్ వ్యవస్థ రాజ్యమేలుతున్నప్పుడు బడుగు బలహీనవర్గాలవారు 'నీ బాంచెన్ దొరా కాల్మొకుతా' అని పెత్తందార్లకు సలాములు చేసేవారు. ఈ సంస్కృతి తమిళ రాజకీయాల్లో ఉందని చెప్పుకోవచ్చు. అన్నాడీఎంకే నాయకులు 'అమ్మ'కు వంగివంగి సలాములు చేస్తుంటారు. ఇక అసలు విషయానికొస్తే...ఈమధ్య అన్నాడీఎంకేకు చెందిన శివకళ పుష్ప అనే రాజ్యసభ ఎంపీ డీఎంకేకు చెందిన రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివను లాగి చెంప మీద కొట్టింది. అది కూడా చాటుమాటుగా కాదు. పబ్లిగ్గా ఢిల్లీ విమానాశ్రయంలో గూబ గుయ్యిమనిపించింది. పైగా తన చర్యను సమర్ధించుకుంది.
అందుకు ఆమె చెప్పిన కారణం...డీఎంకే ఎంపీ సెక్యూరిటీ సిబ్బంది దగ్గర జయలలిత గురించి, అన్నాడీఎంకే గురించి హేళనగా మాట్లాడాడు. ఈమెను చూసి మరింత రెచ్చిపోయాడు. అమ్మను, పార్టీని మాటలనడం ఈమె తట్టుకోలేకపోయింది. చెంప పగలగొట్టింది. ఘర్షణ పడుతున్న వీరిద్దరిని విడదీయడానికి విమానాశ్రయ సిబ్బంది నానా తిప్పలు పడ్డారట...! ఒకప్పుడు వీరిద్దరు స్నేహంగానే ఉండేవారట...! మహిళా ఎంపీ పురుష ఎంపీని ఏ ఉద్దేశంతో కొట్టిందోగాని అమ్మ మాత్రం దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించింది. మహిళా ఎంపీ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని జయలలిత ఫీలయ్యారు. తనపై దుష్ప్రచారం చేయడానికి డీఎంకేకు ఆయుధంగా ఉపయోగపడుతుందని భావించారు. దీంతో ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించారు.
సాధారణంగా బహిష్కరణంటే ఆరేళ్లు ఉంటుంది. ఈమధ్య బీజేపీ ఉత్తరప్రదేశ్ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ పదవి వచ్చిన ఆనందంలో ఒళ్లు మర్చిపోయి బీఎస్‌పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతిని వేశ్యతో పోల్చి అధిష్టానం ఆగ్రహానికి గురయ్యాడు. మాయావతి విమర్శలకు అతీతురాలు కాదు. ఆమె టిక్కెట్లు ఇవ్వడం కోసం డబ్బులు వసూలు చేయడం అవాస్తవం కాదు. ధనదాహం అబద్ధం కాదు. కాని 'వేశ్య'తో పోల్చడం తప్పు కాదు, తప్పున్నర కూడా. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ గెలుపు బీజేపీకి తప్పనిసరి. దయాశంకర్ విమర్శించింది బీఎస్పీ అధినేతనే కాకుండా దళిత నేతను.
దేశంలో దళితులపై, ముస్లింలపై దాడులు జరుగుతుండటంతో జనం బీజేపీపై వ్యతిరేకతతో ఉన్నారు. మరో పక్క ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పరిస్థితిలో దయాశంకర్ విమర్శ బీజేపీ భవిష్యత్తును కాలరాసేదిగా ఉంది. అనేకమంది నాయకులు ఓవరాక్షన్ చేస్తూనే ఉంటారు. విమర్శల్లో పరిధులు దాటుతారు. నాయకత్వాలు తమకు నష్టం లేనంతవరకు ఊరుకుంటాయి. కాని రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావిస్తే చర్యలు తీసుకుంటాయి. ఇదంతా సమయం, సందర్భాన్ని బట్టి ఉంటుంది. నాయకులు తమ అధినేతలను ఎంతైనా పొగడొచ్చు. కాని ప్రత్యర్థులను విమర్శించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.