జేసీ ఆశలు ఆవిరి

రాయలసీమలో పట్టున్న నాయకుల్లో ఒకరు జెసి దివాకర రెడ్డి. కేంద్ర మంత్రి పదవిపై కాస్త గట్టి ఆశలే పెట్టుకున్నారు. దీనికి తగ్గటే గడచిన రెండు వారాలుగా ఆయన పేరు మంత్రివర్గంలో చాన్స్ దొరికేవారి జాబితాలో వినిపించింది. ఆయనకు చాన్స్ దాదాపు గ్యారంటీ అన్నది తెలుగుదేశం సర్కిళ్లలో వినిపించింది. దీనికి తగ్గట్టే జేసీ దివాకర రెడ్డి ఇటీవల తన కామెంట్ ల విషయంలో చాలా కంట్రోలుగా వ్యవహరించారు. అవకాశం కుదిరినపుడల్లా జగన్ ను విమర్శించుకుంటూ వచ్చారు. కానీ తీరా ఇప్పుడు విస్తరణ జరిగింది..జెసి కోరిక నెరవేరలేదు. 

విస్తరణకు ముందు రోజే ఈసారి ఆంధ్రకు ఎటువంటి చోటు లేదని తెలిసిపోయింది. గుడ్డిలో మెల్ల ఏమిటంటే, జెసికే కాదు మరేవరికీ కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం.  బాబు కావాలనే విస్తరణలో తమకు అవకాశం ఇవ్వమని మోడీని అడగలేదని తెలుస్తోంది. సుజనా చౌదరి టైమ్ లో కేబినెట్ బెర్త్ సాధించడం కష్టమైంది. పైగా సుజనాకు అంటే మరీ కష్టమైంది. ఇక ఇప్పుడు ఇవ్వడం అన్నది మోడీకి కాస్త కష్టమే. ఇచ్చినా దాన్ని వాడుకోవడం కూడా బాబుకు కష్టమే. ఎందుకంటే ఈ సారి కేంద్ర మంత్రి పదవి చాన్స్ వస్తే దాన్ని కచ్చితంగా కాపులకే ఇవ్వాల్సి వుంటుంది. ఆ అవకాశాలు తక్కువ. 

కమ్మవారికి మరోటి ఇవ్వడం అంటే పార్టీపై వున్న ముద్రను మరింత గట్టి చేసుకోవడమే. రెడ్లకు ఇవ్వాలంటే దివాకర రెడ్డికి ఇవ్వాలి. అప్పుడు ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికే పెద్ద పీట వేస్తున్నారన్న ఆరోపణలు మరింత గట్టిగా వినిపించే ప్రమాదం వుంది.  ఇవన్నీ అవసరామా ఇప్పుడు? అదీకాక ఇప్పటికే కేంద్రంలో సుజనా ఒకపక్క వుండగా, కంభంపాటి రామ్మోహనరావు కూడా అధికారప్రతినిధి గా వున్నారు. వెంకయ్య నాయుడు సరేసరి. 

ఇలాంటి టైమ్ లో అక్కడికి జెసి లాంటి మరో బలమైన వ్యక్తిని పంపిస్తే లేనిపోని ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే మధ్యేమార్గంగా మోడీని అడగకపోవడం బెటర్ అని బాబు డిసైడ్ అయినట్లుంది. పైగా బాబు ఏం చేసినా లోక కళ్యాణం కొసం అన్నట్లు, రాష్ట్రానికి బోలెడు నిధులు ఇవ్వండి కానీ, మంత్రి పదవులు వద్దు అని బాబు అన్నారంటూ ఆయన అనుకూల దినపత్రికల కథనాలు. అంటే జెసికి పదవి రాకపోవడానికి పరోక్షంగా బాబే కారణం అనుకోవాలి.

Show comments