బికినీ బ్యూటీకి దాదా సాహెబ్‌ ఫాల్కేనా.?

క్వాంటికో టెలివిజన్‌ సిరీస్‌, 'బేవాచ్‌' మూవీ.. ఈ రెండిటితో హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా. ఓ బాలీవుడ్‌ భామ, హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకోవడమంటే చిన్న విషయం కాదు. అందుకామెను అభినందించి తీరాల్సిందే. కానీ, దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారానికిగాను ఆమెను ఎంపిక చేయడమేంటి.? ఇదే ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తుతోన్న అభ్యంతరం.! 

'మేరీకోమ్‌' వంటి సినిమాల్లో నటించినందుకుగాను దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ఆమెకు ప్రకటించినా, ఈ స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి కావేమో. అంతర్జాతీయ స్థాయిలో ఓ బాలీవుడ్‌ నటి గుర్తింపు తెచ్చుకుంటోంది గనుక, ఆమెలో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ 'దాదా సాహెబ్‌ ఫాల్కే' పురస్కారం ఉపయోగపడ్తుందని 'దాదా సాహెబ్‌ ఫాల్కే' పురస్కారాల ఎంపిక టీమ్‌ ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 

మొన్నీమధ్యనే 'కళాతపస్వి' కె.విశ్వనాథ్‌ని దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించింది. ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన కె.విశ్వనాథ్‌, ఆ సినిమాలతో మంచి సందేశాల్ని కూడా అందించారు. దర్శకత్వం అంటే ఇదీ, సామాజిక బాధ్యత అంటే ఇదీ.. అని కె.విశ్వనాథ్‌ ఆ సినిమాలతో నిరూపించారు. అంతేనా, ఎంతోమందిని అత్యుత్తమ నటీనటులుగా తీర్చిదిద్దారు. అంతటి ఘనుడు గనుకనే ఆయన్ని దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించిందనీ, ఆ పురస్కారానికే ఇప్పుడు విశ్వనాథుడు కారణంగా గౌరవం వచ్చిందని అంతా అనుకున్నారు. 

అంతలోనే, ఇంత మార్పు.? కొత్తగా ఏర్పాటు చేసిన కేటగిరీ, 'ఇంటర్నేషనల్లీ ఎక్లైమ్డ్‌' అని పెట్టి, ప్రియాంకా చోప్రాకి దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం అందించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి వుండదు. క్వాంటికో టీవీ సిరీస్‌, 'బేవాచ్‌' సినిమాతో కన్నా, హాలీవుడ్‌కి వెళ్ళాక ఆమె బికినీ అందాలతో రెచ్చిపోయిన వైనంతోనే ఎక్కువ పాపులర్‌ అయ్యింది. ఆ లెక్కన బికినీ కేటగిరీలో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ ఇచ్చారని మనమెందుకు అనుకోకూడదు.?

Show comments