వావ్‌... ఉగ్రవాదాన్ని సహించబోడట.!

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేటోడు జకీర్‌ నాయక్‌.. అనాలేమో.! అమాయక ముస్లిం యువతను తీవ్రవాదం వైపుకు మళ్ళించేలా తీవ్రవాద భావజాలాన్ని పెంచి పోషిస్తోన్న ఇస్లాం మత గురువు, బోధకుడు జకీర్‌ నాయక్‌ ఎట్టకేలకు చాన్నాళ్ళ తర్వాత దర్శనమిచ్చాడు. స్కైప్‌ ద్వారా మీడియా ముందుకు వచ్చిన జకీర్‌ నాయక్‌, తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. కామెడీ ఏంటంటే, ఉగ్రవాదాన్ని జకీర్‌ నాయక్‌ సహించబోడట. 

భారత ప్రభుత్వం కాస్త ఆలస్యంగా కళ్ళు తెరిచింది. జకీర్‌ నాయక్‌ టీవీల ద్వారా చేస్తోన్న ప్రసంగాల్ని తీరిగ్గా పరిశీలించింది, చర్యలు తీసుకుంది. అప్పటికే జరగకూడని ఘోరాలు జరిగిపోయాయి. అల్‌ ఖైదా అధిపతిగా ప్రపంచాన్ని వణికించిన ఒసామా బిన్‌ లాడెన్‌ తీవ్రవాదే కాదట. అమెరికాపై అసలు లాడెన్‌ దాడులు చేయించలేదట. అంతే కాదు, ఇస్లాం వ్యాప్తి కోసమే తీవ్రవాదులు పనిచేస్తోంటే, వారికి తన సంపూర్ణ మద్దతు వుంటుందనీ సెలవిచ్చాడు తన ప్రసంగాల్లో. 

ఇంతలా ఇస్లామిక్‌ టెర్రరిజాన్ని పెంచి పోషించేందుకు తనవంతు కృషి చేసిన జకీర్‌ నాయక్‌, బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడిలో, ముష్కరులకు మార్గదర్శిగా మారడంలో వింతేముంది.? ఆ ఘటనలో విచారణ చేపట్టిన బంగ్లాదేశ్‌, జకీర్‌నాయక్‌ కారణంగానే తమ దేశంలో తీవ్రవాదం పెరిగిపోయిందని తేల్చింది. పొరుగునే వున్నాం కదా, మన భారతీయులం కూడా ఆ ఘటనతో అప్రమత్తమయ్యాం. 

ఇప్పుడేమో, జకీర్‌ నాయక్‌.. తన ప్రసంగాల్ని భారత మీడియా, ఇంకొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయంటూ వాపోతున్నాడు. తానెప్పుడూ తీవ్రవాదానికి మద్దతు పలకలేదని చెబుతున్నాడు. తీవ్రవాద చర్యల్ని తాను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వున్నానంటున్నాడు. ఇస్లాం అంటేనే అహింస అనీ, శాంతియుత మార్గంలో నడవాలని మాత్రమే ఇస్లాం చెబుతుందనీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇస్లాం అనే కాదు, ఏ మతం అయినా హింసను ప్రేరేపించదు.. కానీ ఆ మతం ముసుగులోనే తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు. ఇదిగో, జకీర్‌ నాయక్‌ లాంటోళ్ళే ఆ పాపానికి పూర్తిస్థాయి బాధ్యత వహించాల్సి వుంటుంది. 

తప్పు చేయలేదంటున్నప్పుడు, అజ్ఞాతంలోకి వెళ్ళి రహస్యంగా స్కైప్‌ ద్వారా స్పందించడం ఏంటట.? ప్రపంచానికి తీవ్రవాదం పేరుతో చీడపురుగుల్లా తయారైనవారి ఖాతాలో జకీర్‌నాయక్‌ పేరు చేరిస్తే తప్పేస్త్రంటట.?

Show comments