ఏంటో చంద్రకామెడీ : అప్పుడలా.. ఇప్పుడిలా..!

రాజకీయ నాయకుడు అంటేనే అవకాశవాదానికి, ఏ రోటికాడ ఆ పాట పాడే గాలివాటు తత్వానికి, సందర్భాన్ని బట్టి ప్లేటు ఫిరాయించే చవకబారు బుద్ధికి నిలువెత్తు రూపం. అయితే కొందరు నాయకుల విషయంలో ప్రజలు కొన్ని మినహాయింపులు కోరుకుంటారు. కనీసం పెద్దపదవుల్లో ఉన్న నాయకులైనా కొన్ని విలువలు పాటించాలని ప్రజలు కోరుకుంటే అది వారి తప్పేమీ కాదు. కానీ, రాజకీయాల్లో ‘నా అంతటి వాడు నేడు’ అంటూ కామెడీగా చెబుతూ ఉండే చంద్రబాబునాయుడు మాత్రం ఇలా ప్లేటు ఫిరాయించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. 

వంశధార నిర్వాసితులను ప్రభుత్వం వంచించిన వ్యవహారం కొన్ని రోజుల కిందట బజార్న పడింది. ప్రజల కడుపు మంటలు అగ్నికీలలుగా మారి... కాంట్రాక్టరు ఆస్తులను దహించేసిన తర్వాత గానీ.. ధృతరాష్ట్ర పాలకుల్లో చలనం పుట్టలేదు. తాను ఎప్పుడో జీవో ఇచ్చేశానని దానిని అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం వైఫల్యం వలన ఇలా జరిగిందని.. చంద్రబాబునాయుడు అడ్డగోలుగా ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. ముఖ్యమంత్రి అంతటి వాడిని తాను జీవో ఇస్తేనే ఏడాదిగా అది అమలు కాలేదని.. ‘‘చూస్తున్నారుగా.. నేను ఇచ్చిన జీవోకే దిక్కులేదు’’ అంటూ మీడియా ముందు అదేదో కామెడీ వ్యవహారం అయినట్లుగా తన అసమర్థత గురించి నవ్వుతూ చెప్పుకున్నారు. 

రెండు రోజులు గడిచిందో లేదో.. బుధవారం నాడు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అందులో చంద్రబాబు పార్టీ నాయకులను గదమాయిస్తూ ఏం చెప్పారో తెలుసా? ‘‘ప్రభుత్వంలో కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తోంది. నేను ఒక పని చెప్పానంటే పద్ధతి ప్రకారం జరిగిపోతోంది. పార్టీలోనే ఇంకా కొంత అంతరం ఉంది. దీన్ని సరిదిద్దుతా’’ అని చంద్రబాబునాయుడు సెలవిచ్చారు.

కేవలం రెండురోజుల ముందు తాను జీవో ఇచ్చినా ప్రభుత్వంలో దాన్ని అమలు చేసే దిక్కులేదంటూ అదే చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు... మళ్లీ ప్రభుత్వంలో నేనొక మాట చెబితే అంతా పద్ధతిగా జరిగపోతుంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రెస్ మీట్ లో తన ఎదుట కూర్చుని వినేవాళ్లు వెర్రి వెంగళప్పలు అని చంద్రబాబునాయుడు అనుకుంటారో ఏమో గానీ... ప్రజలు మాత్రం... చూడబోతే అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ చంద్రబాబు మాటను పట్టించుకునే దిక్కులేనట్లుగా కనిపిస్తోంది అని నవ్వుకుంటున్నారు. 

Show comments