వచ్చే ఏడాది మార్చి వరకు జియో కాల్స్ ఉచితమే!

జియో .. రిలయన్స్ వారు టెలికాం రంగంలో ఓ విప్లవం సృష్టించడానికి తాజాగా తీసుకువచ్చిన ఒక ఆయుధం. దేశీయంగా ఉండే మొబైల్ మార్కెట్ ను ఆక్రమించుకోవడం అనేది లక్ష్యంగా.. జియో ను రిలయన్స్ గ్రూపు మార్కెట్ మీదికి సంధించింది. అయితే వేర్వేరు కారణాల రీత్యా జియోకు దక్కుతున్న ఆదరణ మాత్రం పరిమితంగానే ఉంది. జియో సిమ్ లను ఉచితంగానే ఇస్తున్నప్పటికీ, డిసెంబరు నెలాఖరు వరకు జియో ద్వారా అపరిమితమైన ఫోన్ కాల్స్ ఉచితంగానే చేసుకునే వీలు ఉన్నప్పటికీ.. వీటిని వాడుతున్న వారు తక్కువగా ఉంటున్నారు. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి.

ప్రధానంగా మొబైల్ టెలికాం లైన్ ద్వారా కాకుండా, ఇంటర్‌నెట్ డాటా ద్వారా వాయిస్ కాల్ ను ట్రాన్స్‌ మిట్ చేయడం అనే కొత్త టెక్నాలజీ చాలా మందికి అర్థం కాలేదని చెప్పాలి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో అనుకున్న రీతిలో మార్కెట్లో స్పందన కనిపించకపోవడంతో ముఖేష్ అంబానీ తాజాగా గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. మిగతా ఆపరేటర్లు జియో కాల్స్ కు సహకరించడం లేదని,.. గత మూడు నెలల్లో 900 కోట్ల వాయిస్ కాల్స్ ను బ్లాక్ చేసాయని ఆయన ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే దేశీయంగా ఉచిత వాయిస్ కాల్స్ ను అందించి తీరుతాం అని ముఖేష్ ప్రకటించారు.

పైగా తాజాగా వచ్చే ఏడాది మార్చి 31 వరకు జియో సేవలు సమస్తం ఉచితంగానే అందించబోతున్నట్లు అంబానీ ప్రకటించారు. ముందు ఈ డిసెంబరు నెలాఖరు వరకు మాత్రమే ఉచిత సేవలు అని ప్రకటించినప్పటికీ.. ఇతర ఆపరేటర్ల తో ఎదురవుతున్న ఇబ్బందులు, వినియోగదారులు ఇంకా పూర్తిగా అలవాటు పడకపోవడం నేపథ్యంలో.. రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ని రాయితీలు ఇచ్చి అయినా సరే.. దేశీయ మొబైల్ రంగంలో తాము అనుకున్న స్థాయికి చేరుకోవాలని రిలయన్స్ దూకుడుగా ఉత్సాహపడుతున్నట్లుగా కనిపిస్తోంది. 

Show comments