లోకేశ్ పై బాబు ఫిక్సయిపోయారా?

తనయుడు, తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకుని పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్న నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం విషయంలో తండ్రి చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయానికి వచ్చేసారా? ఇన్నాళ్లుగా కేంద్రంలోకి లోకేష్, మంత్రివర్గంలోకి లోకేష్ ఇలా రకరకాల వార్తలు వినిపించడమే కానీ, వాస్తవ రూపం దాల్చలేదు. దీనికి మరేం కారణం కాదు. ఎలాంటి పరోక్ష విమర్శలు వస్తాయో? ఎవరేమనుకుంటారో? ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో అని చంద్రబాబు ఆలోచించడమే.

అయితే ఇప్పుడు ఈ విషయంలో చంధ్రబాబు ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం అనుకూల మీడియా ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో భారీగా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో్ ఒకదాన్ని లోకేష్ కు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు వార్తలు అందించాయి. అంతే కాదు, ఆ తక్షణమే మంత్రి వర్గంలోకి కూడా తీసుకుంటాయని అవి కథనాలు అందిస్తున్నాయి. వాస్తవానికి ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు అన్నది చాలా అరుదుగా జరిగే వ్యవహారం. ఇప్పటికే నారాయణ, యనమల రామకృష్ణుడు ఇలా వున్నారు. లోకేష్ కూడా అదే బాపతు అయితే మూడో మంత్రి అవుతారు. కానీ తప్పదు. ఎందుకంటే మరో దారి లేదు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలంటే 2019 దాకా వేచి వుండాలి.లేదా ఎవరయినా రాజీనామా చేసి లోకేష్ కు దారి ఇవ్వాలి. అలా చేయడం మరిన్ని విమర్శలకు తావిస్తుంది.

లోకేష్ మంత్రి పదవి అవసరం...

ఇప్పుడు తక్షణం లోకేష్ ను మంత్రిగా చూడాల్సిన అవసరం ఏమిటి? దీనికి కారణం మరేమీ కాదు. లోకేష్ పరోక్షంగా అధికారులతో మాట్లాడితే అది రాజ్యాంగేతర శక్తి అని ముద్రవేయడానికి అవకాశం ఇస్తుంది. కానీ పార్టీ శ్రేణుల కోసం, నాయకుల కోసం చిన్న చిన్న పనులయినా చక్క బెట్టకపోతే, మన ప్రభుత్వంలో కూడా మనకు పనులు జరగడం లేదన్న అసంతృప్తి పెరుగుతుంది. కానీ చంద్రబాబు సీనియార్టీ, ఆయన స్థాయి మేరకు ఇలా చిన్న చిన్నవ్యవహారాల్లో దూరే పరిస్థితీ లేదు. ఆయన దగ్గరకు వీళ్లు వెళ్లే వీలూ లేదు. పోనీ మిగిలిన మంత్రుల దగ్గరకి వెళ్లాలంటే, కొన్ని విషయాల్లో ఇలా చేస్తే, బాబు ఏమనుకుంటారో? చేయకపోతే ఏమనుకుంటారో అన్న మీమాంసలతోనే సరిపోతుంది. అదే లోకేష్ అయితే పరిస్థితి వేరు.  Readmore!

ఇటీవల శాతకర్ణి సినిమా విడుదల విషయంలో కూడా పార్టీ అభిమానుల్లో కొంత అసంతృప్తి ఏర్పడింది. శాతకర్ణికి ఆంధ్రలో సరిగ్గా ధియేటర్లు దొరకలేదు. కానీ ప్రచారం మాత్రం ఖైదీ సినిమాను నొక్కేస్తున్నారని, థియేటర్లు దొరకనివ్వడం లేదని రివర్స్ లో జరిగింది. ఉత్తరాంధ్రలో శాతకర్ణికి కాసిన్ని థియేటర్లు దొరకడం కోసం కూడా కిందా మీదా పడాల్సి వచ్చింది. అలాగే శాతకర్ణికి స్పేషల్ షోలు కూడా సరిగ్గా వేయడం కుదరలేదు.

అధికారం వుండి కూడా ఇలా జరిగిందని బాలయ్య ఫ్యాన్స్ బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్రల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కాపుల థియేటర్లు కూడా ఖైదీకే అనుకూలంగా ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేష్ మంత్రిగా వుంటే కాస్తయినా ఇలాంటి పనులు జరుగుతాయి. పార్టీ శ్రేణులు సంతృప్తిగా వుండాలి అంటే వాళ్లకి చిన్న చిన్న పనులు జరగాలి. సీనియర్ మంత్రులు ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. అదే లోకేష్ అయితే ఇవే కావాలి. ఎందుకుంటే ఇలాంటి పనుల ద్వారానే ఆయన పార్టీ కింది శ్రేణుల వరకు వెళ్లిపోగలుకుతారు. అందుకే వీలయినంత త్వరలో లోకేష్ ను మంత్రిగా చేయాలని చంద్రబాబుపై వత్తిడి వస్తోందని, ఆమేరకు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అదే ఈ కథనాలకు ఆధారం అని వినికిడి.

Show comments

Related Stories :