కాళ్ళు నరికేశారు: న్యాయం జరిగేనా.?

ఓ ఆసుపత్రి యాజమాన్యం.. నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంది. లేని రోగానికి చికిత్స చేసి, ఓ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసిన పాపానికి లక్షలు చెల్లించాల్సి వచ్చింది. 

- ఏడాదికోసారి మాత్రమే ఇలాంటి వార్తలు వెలుగు చూస్తుంటాయి. ఆసుపత్రి నిర్లక్ష్యానికి గర్భిణి బలి.. అన్న వార్తలు మాత్రం నిత్యం చూస్తూనే వుంటాం. చాలా అరుదుగా మాత్రమే, ఆసుపత్రులు నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆయా కేసుల్లో, బాధిత వ్యక్తి ఎంత గట్టిగా న్యాయ పోరాటం చేశాడన్నదానిపై 'న్యాయం' ఆధారపడి వుంటుందా.? అనదానిపైనా స్పష్టత వుండదు. 

వైద్య రంగంలో విపరీత పోకడల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 'మోడ్రన్‌ వైద్యం' పుణ్యమా అని అవసరమయినదానికీ, కానిదానికీ సర్జరీలు సర్వసాధారణమైపోయాయి. సాధారణ కడుపునొప్పితో మహిళలు ఆసుపత్రికి వెళితే చాలు, గర్భాశయాన్ని తొలగించేస్తున్నారు. అంతెందుకు, అపెండిసైటీస్‌ ఆపరేషన్లు కుప్పలు తెప్పలుగా జరుగుతున్న వైనం గురించి తెలుగు రాష్ట్రాల్లో కుప్పలు తెప్పలుగా ఆధారాలు కనిపిస్తాయి. పాలకులు ఏం చేస్తున్నారు.? అనడక్కండి. అదంతే. మనిషి జీవన ప్రమాణాలు మన దేశంలో మరీ గొప్పగా ఏమీ పెరిగిపోలేదు. కాస్తో కూస్తో పెరిగాయనుకున్నా, ఆధునిక వైద్యం పుణ్యమా అని, ఆ మనిషి జీవితమే నాశనమయిపోతోంది.. ఆర్థికంగా చితికిపోతోంది. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, నిఖిల్‌ రెడ్డి అనే పాతికేళ్ళ యువకుడు, హైట్‌ పెరగాలంటూ ఆసుపత్రికి వెళితే, కాళ్ళు నరికి పారేశారు డాక్టర్లు. అది చికిత్సలో భాగం. కాళ్ళను కత్తిరించి, ఎముకల మధ్య గ్యాప్‌ పెంచి, ఆ ఎముకల పెరుగుదలకు మందులిచ్చి, తద్వారా హైట్‌ పెంచడం ఈ ట్రీట్‌మెంట్‌ ఉద్దేశ్యం. మొహమ్మీద మొటిమలకు తీసుకునే చికిత్సకీ, ఈ కాళ్ళ నరికివేత చికిత్సకీ తేడా లేదా.? ఆరోగ్యంగా వున్న యువకుడు, హైట్‌ మీద ఇంట్రెస్ట్‌తో ఆసుపత్రికి వెళితే, అత్యంత ప్రమాదకరమైన సర్జరీ ఎలా చేసేస్తారు.? ఈ మాత్రం కామన్‌సెన్స్‌ ఆ వైద్యులకు లేకుండా పోయింది. డబ్బులొస్తే చాలు ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడే కార్పొరేట్‌ ఆసుపత్రి.. ఇదిగో ఇలా నిఖిల్‌ రెడ్డి జీవితంతో ఆడుకుంది. 

ప్రస్తుతానికి నిఖిల్‌రెడ్డి కదల్లేని, ప్రాణం వున్న మనిషి మాత్రమే. సరదాగా ఆడిపాడాల్సిన వయసులో, ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. ఇప్పుడు తీరిగ్గా న్యాయపోరాటం చేస్తున్నాడు. తల్లిదండ్రులకు తీరని ఆవేదనను మిగిల్చిన నిఖిల్‌రెడ్డి, చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతున్నా, ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. వైద్యుడంటే దేవుడు. కష్టంతో వచ్చిన రోగికి వైద్య చికిత్స చేసి, పంపించాలి. సరదాగా వచ్చిన వ్యక్తిని కాళ్ళు విరగ్గొట్టి పంపించేయకూడదు. ఈ మాత్రం ఇంగితం వైద్య విద్య, సదరు డాక్టర్‌కి నేర్పలేకపోయింది. 

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ.. అని ఓ సినిమాలో మాంఛి పాటొకటుంది. నిఖిల్‌రెడ్డి న్యాయపోరాటం, న్యాయస్థానంలో నిలుస్తుందా.? ఇది నైతిక విలువల కోణంలో ఆలోచించాల్సిన విషయం. నిఖిల్‌ స్వయంగా ఆసుపత్రికి వచ్చాడు గనుక, అతని అనుమతి వుంది గనుక, ఇష్టపూర్వకంగా చికిత్స చేయించుకున్నాడు గనుక, ఇందులో 'ఇల్లీగల్‌' ఏమీ లేదంటోంది ఆసుపత్రి యాజమాన్యం. ఆ లెక్కన, అది తప్పు కాదు. నైతికత కోణంలో చూస్తే మాత్రం, సదరు ఆసుపత్రిపై కఠిన చర్యలు తప్పకపోవచ్చు. 

చూద్దాం.. నిఖిల్‌ రెడ్డి కాళ్ళ నరికివేత వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో.!

Show comments