బాబుది నిజమా?...నాదెండ్లది వాస్తవమా?-2

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఆత్మకథ పేరు 'నా జీవిత ప్రస్థానం'. దీని తొలి ముద్రణ 2008.  తెలుగుదేశం పార్టీని స్థాపించాలని యోచన చేసింది ఎన్టీరామారావేనని, ప్రాంతీయ పార్టీ పెడుతున్నానని ఆయన ప్రకటించాకనే అందులోకి నాదెండ్ల భాస్కరరావు, ఇతరులు ప్రవేశించారనేది లోకానికి తెలిసిన కథనం. ఇదే ఇప్పటివరకు చరిత్రగా చెలామణి అవుతోంది. కాని...ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన చేసింది తానేనని, ఆ సమయంలో ఎన్‌టిఆర్‌ ఎవరో కూడా తనకు తెలియదని, పార్టీలో చేరతానని ఎన్‌టిఆర్‌ తనంతట తాను ముందుకు వస్తే ఆయన అధ్యక్షుడిగా ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేశామని నాదెండ్ల భాస్కరరావు చెప్పే కథనం. ఎన్‌టిఆర్‌ ఇమేజ్‌ ఉన్న హీరో, జనాకర్షణ గల కథానాయకుడు కాబట్టి ఆయన్ని పార్టీకి అధ్యక్షుడిని చేశానని నాదెండ్ల చెప్పారు. ఆ రోజుల్లో తెలుగు పత్రికలు ఎన్టీఆర్‌కు పూర్తిగా మద్దతునిచ్చాయి. కథనాలు, ఇంటర్వ్యూలు విస్తృతంగా ప్రచురించాయి.  ఏ కథనాలు, ఇంటర్వ్యూల్లోనూ చంద్రబాబు సలహా కారణంగానే టీడీపీ ఆవిర్భవించినట్లు వచ్చిన దాఖలా లేదు. చంద్రబాబు కాంగ్రెసు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ విషయం బయటపెట్టకూడదని ఆయన ఎన్టీఆర్‌ను కోరారా? లేదా అల్లుడికి ఇబ్బంది కలిగించకూడదని ఈయన చెప్పలేదా? 

పార్టీ స్థాపించాలనుకున్న ఎన్‌టిఆర్‌ దానిపై ఎటువంటి కసరత్తు చేశారు? ఎవరెవరితో సమావేశాలు నిర్వహించారు? పార్టీకి రూపకల్పన చేయడానికి ఎలాంటి కృషి చేశారు? ఏఏ అంశాలను పరిశీలించారు? డాక్యుమెంటేషన్‌ వర్క్‌ చేశారా? అనే వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలియదు.  దీన్ని గురించి నాదెండ్ల భాస్కరరావు తన ఆత్మకథలో ఇలా రాసుకున్నారు. ''భవనం వెంకట్రామ్‌ నన్ను కేబినెట్‌లోకి తీసుకోవడానికి అయిష్టత చూపారు. ఒక రకంగా నన్ను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంవల్ల నేను ప్రాంతీయ పార్టీ పెట్టడానికి భవనం వెంకట్రామ్‌ పరోక్షంగా దోహదపడ్డారనుకోవచ్చు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైపోయింది. కాంగ్రెసు పార్టీ తరపున నేను ఎమ్మెల్యేగా గెలిచివున్నాను గనుక శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రాంతీయ పార్టీని స్థాపించడంలో నా వెంట ఉండి నాకు బాగా సహకరించిన వారిలో ప్రముఖులు ఆనాటి ఎమ్మెల్యేలైన గద్దె రత్తయ్య, సి నారాయణ, ఆదెయ్యలు. వీరు ముగ్గురూ కాంగ్రెసు శాసనసభ్యులే. 

కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులుగా గెలిచి కొత్త పార్టీలో కొనసాగడం నైతికంగా సమర్ధనీయం కాదు కనుక శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చాము. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ప్రాంతీయ పార్టీ ఉనికి అటో ఇటో తేలకుండానే, తెలుసుకోకుండానే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడమేమిటని వారు అందుకు నిరాకరించారు. కాని నేను వారిలా ఊగిసలాడుతూ ఉండలేకపోయాను. శాసనసభ్యుడిగా  నాకు వచ్చే జీతభత్యాలు అక్కరలేదని వారిస్తూ 1982 ప్రారంభంలో శాసనసభ్యత్వానికి రాజీనామా ఇచ్చేశాను'' ప్రాంతీయ పార్టీని తన మానస పుత్రికగా అభివర్ణించుకున్నారు నాదెండ్ల. చెన్నయ్‌ నుంచి డిఎంకె, అన్నా డిఎంకె పార్టీ ప్రణాళికలు, వారు సిద్ధం చేసుకున్న రూల్స్‌, రెగ్యులేషన్స్‌ తెప్పించుకొని అధ్యయనం చేశానన్నారు. ఈ విషయాలన్నీ తన మిత్రులతో చర్చిస్తూనే ప్రాంతీయ పార్టీ ఆవిర్భావ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో తన భార్య సహకారంతో నియమ నిబంధనలు వగైరా రూపొందించుకున్నానని చెప్పారు. 

ప్రాంతీయ పార్టీ ఏర్పాటుపై భావసారూప్యత గల మిత్రులతో సమావేశాలు పెట్టి చర్చించానని రాశారు. నాదెండ్ల ఈ విధంగా ప్రాంతీయ పార్టీ ఏర్పాటు పనుల్లో తలమునకలుగా ఉన్నప్పుడే ఆయనకు ఎన్‌టిఆర్‌ ఫోన్‌ చేశారు. నాదెండ్ల రాసింది నిజమని నమ్మకమేమిటి? అని ఎన్‌టిఆర్‌ అభిమానులు ప్రశ్నించవచ్చు.  తాను అన్ని నిజాలే రాశానని ఆయన చెప్పుకున్నాడు. ''వాస్తవానికి ఈ జ్ఞాపకాలను ఎప్పుడో మీతో పంచుకోవాల్సి ఉంది. నా మనోజగత్తు నిస్తబ్దత వహించిన కారణంగా నేను ఇంతకాలం మౌనంగా ఉండిపోవల్సి వచ్చింది. దీని కారణంగా నేను చెప్పవల్సిన ఎన్నో, మరెన్నో విషయాలు గత కాలంలో తమ చోటు వెదుక్కున్నాయి. నా జీవితం తెరచిన పుస్తకం'' అని ముందు మాటలో రాశారు నాదెండ్ల. 407 పేజీల ఈ ఆత్మకథలో నాదెండ్ల తన బాల్యం నుంచి ప్రారంభించి తాను ముఖ్యమంత్రి కావడానికి దారి తీసిన పరిస్థితుల వరకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఎలా ప్రాణం పోసుకున్నదో వివరించి, ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రి కావడం, ఆయన పరిపాలనా విధానం, వివిధ నిర్ణయాలు, వాటి వల్ల కలిగిన పరిణామాలు, పార్టీలో తిరుగుబాటు...మొదలైనవన్నీ రాశారు. ఇందులో చంద్రబాబు ప్రస్తావన కూడా ఉంది. అయితే చంద్రబాబు చెప్పుకుంటున్నట్లు లేదు. మరోవిధంగా ఉంది. ఏమిటది?

Show comments