టార్గెట్‌ టాలీవుడ్‌: 'వాయిస్‌' పెరుగుతోంది

డ్రగ్స్‌ కేసులో సినీ పరిశ్రమ 'టార్గెట్‌' అవడంపై సినీ పరిశ్రమకు చెందిన 'పెద్దలు' స్పందించడానికి అంతగా ఆసక్తి చూపడంలేదు. 'వ్యవహారం మా దాకా రాలేదు కదా..' అని కొందరు, 'మావాళ్ళు తప్పించుకున్నట్టే..' అని ఇంకొందరు, 'కెలికి వివాదం కొనితెచ్చుకోవడం ఎందుకు.?' అని మరికొందరు అనుకోవడంతోనే ఈ సమస్య వస్తోందని ఆఫ్‌ ది రికార్డ్‌గా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఆ సంగతెలా వున్నా, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ముందుగా ఈ విషయమై స్పందించాడు. తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్‌ పేరుతో టార్గెట్‌ చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడాయన. సోషల్‌ మీడియాలో ఆరోపణలు చేసి ఊరుకోలేదు, మీడియా ముందుకొచ్చి తన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చాడు. సినీ పరిశ్రమకు చెందినవారిని ప్రశ్నిస్తున్నట్లే, ఇతరుల్నీ ప్రశ్నించగలరా.? అంటూ నిలదీసే ప్రయత్నం చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. 

తాజాగా, 'విప్లవ చిత్రాల' స్పెషలిస్ట్‌ ఆర్‌.నారాయణమూర్తి గళం విప్పారు. సినీ పరిశ్రమను టార్గెట్‌ చేయడం బాధగా వుందన్నారాయన. డ్రగ్స్‌ వ్యవహారానికి సంబంధించి సినీ పరిశ్రమనే టార్గెట్‌ చేయడమేంటని ప్రశిస్తూ, సమాజంలో చాలామందికి డ్రగ్స్‌ అలవాటు వుంటుందనీ, వారెవర్నీ ఎందుకు ప్రశ్నించడంలేదని ఆర్‌.నారాయణమూర్తి నిలదీశారు. ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, మీడియా సైతం సినీ పరిశ్రమకి డ్రగ్స్‌ పేరుతో 'సినిమా' చూపించడాన్ని ఆర్‌.నారాయణమూర్తి తప్పుపట్టారు. 

వీళ్ళే కాక ఇంకొందరూ ఈ డ్రగ్స్‌ వ్యవహారంపై సినీ పరిశ్రమ నుంచి స్పందిస్తున్నా, 'కర్ర విరగకుండా, పాము చావకుండా..' అన్న చందాన వారి స్పందనలు చాలా 'లైట్‌'గా కన్పిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. 

'డ్రగ్స్‌తో సినీ పరిశ్రమలోనివారికి లింక్‌ వుంటే అరెస్ట్‌ చేయొచ్చు.. అదే సమయంలో, సినీ పరిశ్రమకు చెందినవారిని తప్ప, ఇతరుల్ని ఎందుకు విచారణకు పిలవడంలేదు.?' అన్న ప్రశ్న సోకాల్డ్‌ సినీ పెద్దల నుంచి రాకపోవడమే ఆశ్చర్యకరం. 

Show comments