కాక‌పుట్టిస్తున్న‌ అయ్య‌న్న‌

విశాఖ జిల్లాల‌కు చెందిన మంత్రులు అయ్య‌న్న‌పాత్రుడు, గంటా శ్రీ‌నివాసరావు మ‌ధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక‌రిమీద ఒక‌రు పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి ఫిర్యాదు చేసుకుంటున్నారు. విశాఖ భూకుంభ‌కోణంలో గంటా పాత్ర ఉంద‌ని అయ్య‌న్న విశాఖ వీధుల్లో గంటాను క‌డిగిపారేస్తున్నాడు. బ‌య‌ట నుంచి వ‌చ్చిన వారి వ‌ల్ల విశాఖ ప‌రువుపోతోంద‌ని, వేల కోట్ల భూకుంభ‌కోణంలో వారి పాత్ర ఉంద‌ని స‌హ‌చ‌ర మంత్రి గంటాను ఉద్ధేశించి తీవ్ర ఆరోప‌ణలు చేశాడు. 

దీంతో ఆగ్ర‌హం చెందిన గంటా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు లేఖ రాశాడు. అయ్య‌న్న వ్యాఖ్య‌ల వ‌ల్ల జిల్లాలో పార్టీ ప‌రువు మంట‌గ‌లిసి పోతోంద‌ని పార్టీ అధినేత‌కు కంప్లైంట్ చేశాడు. విశాఖ భూకుంభ‌కోణంపై సొంత పార్టీ నేత‌లు, మిత్ర‌ప‌క్ష బీజేపీ నాయ‌కులు సైతం విమ‌ర్శ‌లు చేయ‌డంతో కుంభ‌కోణం విచార‌ణ‌కు స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీం ఏర్పాటు చేశాడు సీఎం బాబు.

అయితే అయ్య‌న్న‌పై గంటా ఫిర్యాదు చేసిన విష‌యంలో చంద్ర‌బాబుకు ఏం చేయాలో పాలుపోకుండా ఉంది. విశాఖ భూ కుంభ‌కోణంలో గంటా హ‌స్తం ఉంద‌ని నిరూపించేందుకు అయ్య‌న్న వ‌ద్ద ప‌క్కా సాక్షాధారాలున్నాయ‌ట‌. ఒకవేళ ముఖ్య‌మంత్రి అడిగితే వాటిని ఆయ‌న వ‌ద్ద ప్ర‌వేశ‌పెట్టేందుకు అయ్య‌న్న వ‌ర్గం సిద్ధంగా ఉంది. అయితే అయ్య‌న్న ప్ర‌స్తుతం సింగపూర్ లో ఉన్నారు. ఆయ‌న విశాఖ రాగానే ప‌త్రాల‌తో సీఎంను క‌ల‌వాల‌ని నిర్ణ‌యించార‌ట‌.

కాగా సీఎం చంద్ర‌బాబు, ఇత‌ర మంత్రులు మాత్రం సాక్షాధారాలుంటే సిట్ కు ఇవ్వాల‌ని వాళ్లు విచారించి నివేదిక అంద‌జేస్తార‌ని అయ్య‌న్న‌కు సూచిస్తున్నారు. అందుకు అయ్య‌న్న వ‌ర్గం ఎంత మూత్ర‌మూ సుముఖంగా లేదు. విశాఖ భూకుంభ‌కోణంలో అంద‌రూ అనుకుంటున్నంత చిన్న‌దేమీ కాద‌ని, దీని వెన‌కాల చాలా మంది ప్ర‌భుత్వ పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని, అందుకు త‌గిన అన్ని రెవ‌న్యూ ఆధారాలు అయ్య‌న్న వ‌ద్ద ఉన్నాయ‌ని ఆయ‌న వ‌ర్గం చెబుతోంది.

దీంతో అధికార‌నేత‌ల్లో గుబులు మొద‌లైంది. విశాఖ భూకుంభ‌కోణం సంబంధించి అయ్య‌న్న వ‌ద్ద ఎవ‌రెవ‌రి జాత‌కాలున్నాయ‌నేదానిపైనే ఇప్పుడు తెలుగుదేశం నేత‌ల్లో తీవ్ర చ‌ర్చ‌జ‌రుగుతోంది. అయ్య‌న్న లాగే తీగ‌కు స‌ర్కారు డొంక అంతా క‌దిలి పార్టీ, ప్ర‌భుత్వం ప‌రువు బ‌జారున ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. 

మ‌రోవైపు అయ్య‌న్న మాత్రం విశాఖ భూకుంభ‌కోణం వ్య‌వ‌హారంలో చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థి గంటాను రాజ‌కీయంగా భారీ దెబ్బతీసే అవ‌కాశం ఈ రూపంలో ఆయ‌న‌కు దొరికింది. విశాఖ రాజ‌కీయాల్లో ఆది నుంచి టీడీపీలోనే కొన‌సాగుతున్న అయ్య‌న్నకు మించి నాలుగు పార్టీలు మారి వ‌చ్చిన గంటాకు ముఖ్య‌మంత్రి వ‌ద్ద ప‌లుకుబ‌డి పెర‌గ‌డం, దాంతో విశాఖలో గంటా చ‌క్రం తిప్పుతుండ‌డం అయ్య‌న్న‌కు ఎంత మాత్ర‌మూ మింగుడుప‌డ‌డం లేదు. 

గంటాను దెబ్బ‌కొట్టేందుకు స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్న అయ్య‌న్న‌కు విశాఖ భూకుంభ‌కోణం బ్ర‌హ్మాస్త్రం దొరికింది. కుంభ‌కోణం వెన‌కాల ఉన్న గుట్టు మొత్తాన్ని అయ్య‌న్న త‌వ్వితీశారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భూముల క‌బ్జాకు పాల్ప‌డిన చిట్టా మొత్తం ఆయ‌న వ‌ద్ద ఉంద‌ట‌. అద‌ను చూసి వ్య‌వ‌హారం మొత్తాన్ని బ‌హిరంగప‌ర‌చాల‌ని అయ్య‌న్న వేచిచూస్తున్నారు.

ఈ స‌మాచారం మొత్తం బ‌య‌ట‌కొస్తే పార్టీ కొంప మునుగుతుంద‌ని భావించి సీఎం చంద్ర‌బాబు సిట్ ఎత్తుగ‌త వేశాడు. భూ కుంభ‌కోణాల‌పై త‌మ వ‌ద్ద‌నున్న ఆధారాలు, స‌మాచారాన్ని సిట్‌కు అంద‌జేసి విచారణ‌లో స‌హ‌క‌రించాల‌ని సూచించారు. సిట్ కిఇచ్చిన స‌మాచారం ఎక్క‌డికి పోతుందో, దాని ఏర్పాటు వెన‌కాల అస‌లు ఉద్ధేశం ఏంటో పూర్తిగా తెలిసిన అయ్య‌న్న త‌న వ‌ద్ద ఉన్న స‌మాచారాన్నిసిట్‌కు అంద‌జేసేందుకు స‌సేమిరా అంటున్నారు.

భూ కుంభ‌కోణంతో త‌న ప‌రువు విశాఖ స‌ముద్రంలో క‌లిసిపోతోంద‌ని భ‌య‌ప‌డుతున్న గంటా మాత్రం సీబీఐ విచారణ జ‌ర‌పాల‌ని పైకి మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సింగ‌పూర్ నుంచి రాగానే అయ్య‌న్న భూకుంభ‌కోణం గురించి ఏమి ప్ర‌క‌టిస్తారోన‌ని అటు విశాఖ‌తోపాటు రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది.

అయితే ఈ కుంభ‌కోణంలో పార్టీ నేత‌ల నిర్ల‌ప్త‌త‌పై జ‌గ‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. అయ్య‌న్న‌లాగా మ‌న‌వాళ్లు ఎందుకు కుంభ‌కోణం మూలాలు త‌వ్వి తీయ‌లేక‌పోయార‌ని జిల్లా పార్టీ నేత‌ల‌పై జ‌గ‌న్ మండిప‌డుతున్నారు. ప్ర‌భుత్వంలో జ‌రిగిన ఇంత పెద్ద భూ కుంభ‌కోణాన్ని స‌రిగా ఉప‌యోగించుకోలేపోతున్నామ‌ని జ‌గ‌న్ అస‌హనం వ్య‌క్తం చేస్తున్నారు.

Show comments