మొత్తానికి నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ పై జాలి చూపారు కాంగ్రెస్ వాలాలు. ఆల్రెడీ సిద్దూకు ఎంతో చేస్తామని హామీని ఇచ్చి చివరకు మంత్రి పదవికి పరిమితం చేశారు. ఇదే సమయంలో న్యాయసలహా అంటూ.. మంత్రి పదవా, టీవీ షోలా.. ఏదో ఒకటి తేల్చుకోవాలన్నట్టుగా మొన్న అమరీందర్ మాట్లాడటంతో.. సిద్ధూను చాలానే ఇబ్బంది పెట్టేసినట్టు అయ్యింది.
అయితే ఇప్పుడు అమరీందర్ కాస్త మాట మార్చారు. సిద్ధూ టీవీ షోల విషయంలో సానుకూలంగా స్పందించారు. తనకు వేరే వ్యాపారాలు లేవని, తనకు సంపాదన మార్గం టీవీ షోలు మాత్రమే అని సిద్ధూ కాస్తంత జాలి గొల్పేలా మాట్లాడటంతో అమరీందర్ కూడా కరిగినట్టున్నారు. టీవీ షోలు చేసుకోవచ్చు.. అని ముఖ్యమంత్రి హోదాలో తన మంత్రికి పర్మిషన్ ఇచ్చారు అమరీందర్.
‘అదొకటే సంపాదన మార్గం అంటున్నాడు.. సిద్దూ టీవీ షోలు చేసుకోవచ్చు..’ అని అంటూ అమరీందర్ అనుమతినిచ్చారు. జీవనోపాధి మార్గం నుంచి ఆలోచించి సిద్ధూ పట్ల పెద్దాయన జాలి చూపినట్టున్నారు. ముఖ్యమంత్రి ఈ విధంగా అనుమతిని ఇవ్వడంతో.. సిద్ధూ కు షోల విషయంలో ఊరట లభించినట్టే అనుకోవాలి. నవ్వుల ప్రవాహానికి బ్రేకేమీ లేనట్టే!