‘బుల్లి అమ్మ’ పొరబాటు స్టెప్ వేస్తోందా?

తమిళనాట రాజకీయాలు మళ్లీ ఒక కొత్త టర్న్ తీసుకోబోతున్నాయా అనిపిస్తోంది. జయలలిత మేనకోడలు దీప కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారు. జయలలితను ‘అమ్మ’ అని కీర్తించిన తమిళ ప్రజలు, ఆమె నెచ్చెలి శశికళను ‘చిన్నమ్మ’ గా గుర్తించేశారు. మరి ఇప్పుడు అమ్మ మేరకోడలు రాజకీయ తెరంగేట్రం చేస్తే.. ‘బుల్లి అమ్మ’ అంటూ నెత్తిన పెట్టుకుంటారో లేదో తెలియదు గానీ.. అన్నా డీఎంకే పార్టీ లోనే తమ ప్రాబల్యం పెంచుకోడానికి, కావలిస్తే దానినే పన్నీర్ సహకారంతో ఒక ముక్కగా చీల్చడానికి ప్రయత్నం చేయకుండా దీప సొంత పార్టీ ఆలోచన చేయడం ద్వారా పొరబాటు స్టెప్ వేస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 

జయలలిత బతికి ఉన్నన్నాళ్లూ ఆమెకు సంబంధించిన బంధువులు ఎవరూ దగ్గరకు రాకుండా శశికళ ఓ అడ్డుగోడలా ఉన్నదనే ప్రచారం ఒకటి ఉంది. నిజానికి , శశికళ బంధువు దినకరన్ ను కూడా జయలలిత చాలా దూరం పెట్టారు గానీ.. ఇవాళ పార్టీ సారథ్యం అతని చేతుల్లోనే పెట్టబడ్డది. అమ్మ ఆశయాలను నెరవేర్చే కృషిగా ఇలాంటి నిర్ణయాలను శశికళ ఎలా సమర్థించుకుంటారో గానీ.. దీప కొత్త రాజకీయ పార్టీ ఆలోచన చేసినంత మాత్రాన ప్రజల్లో ఆదరణ పెంచుకోవడం అంత సులువు కాదని పలువురు అంటున్నారు. 

దీప మరియు ఆమె సోదరుడు జయలలిత ఆస్తులు , పోయెస్ గార్డెన్ ఇల్లు లాంటి వాటిపై హక్కులు తమకు చెందాలంటూ న్యాయపోరాటం ద్వారా సాధించుకోవాలని.. తద్వారా జయలలిత వారసత్వం వారికి ఉన్నది అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించాలని.. అప్పుడు అన్నా డీఎంకే పార్టీ మీద కూడా పట్టుకోసం ప్రయత్నించవచ్చునని... అలాంటి ప్రయత్నాలు ఏవీ లేకుండా.. ఏదో ఇప్పుడు తన పేరు నలుగురిలో నానుతున్నది గనుక.. ఈ క్రేజ్ ను నమ్ముకుని సొంత పార్టీ అనే సాహసం చేస్తే బోల్తా పడుతుందని పలువురు అనుకుంటున్నారు. 

తమిళనాట రాజకీయాల్లో రాబోయే కొద్ది వారాల్లో ఇంకా అనేక మలుపులు ఉన్నాయని అనిపిస్తోంది. విశ్వాసపరీక్ష మళ్లీ జరగాలంటూ కోర్టులో ఒక కేసు నడుస్తున్నది. రాష్ట్రపతి వద్దకు నివేదించడానికి డీఎంకే సిద్ధమవుతున్నది. స్పీకరు మీద అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వబడ్డది. ఈలోగా అన్నాడీఎంకే కు మొన్న ఓటు వేసిన ఎమ్మెల్యేల్లో వీలైనంత మందిన తన కోటరీలోకి లాక్కోవడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నిజానికి పన్నీర్ సెల్వం దీపకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇన్నింటి నడుమ జయలలిత మేనకోడలు దీప.. కొన్నాళ్లు వేచిచూసే ధోరణి అవలంబించకుండా.. అప్పుడే కొత్త పార్టీకి సిద్ధం కావడం వ్యూహాత్మకంగా తప్పిదంగా తేలిపోతుందని పలువురు అంటున్నారు.  Readmore!

Show comments