జగన్ చేసినట్లు కాదు..బాబు చెప్పినట్లు

విశాఖలో సీపీపై విజయవాడలో కలెక్టర్ పై జగన్ విరుచుకుపడినట్లు నానా హడవుడి చేసి, హోదా విషయాన్ని, దివాకర్ ట్రావెల్స్ బస్ ప్రమాదం వ్యవహారాన్ని చాలా చాకచక్యంగా పక్కదారి పట్టించడంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల మన మీడియా తన వంతు సేవాతత్పరత తాను చాటుకుంది. కానీ అదే చంద్రబాబు మన మాట వినని అధికారులను మార్చేయండి అంటే మాత్రం అదే మీడియాకు అస్సలు పట్టలేదు.

‘’... రాజకీయాల్లో మనం సమర్థంగా పనిచేయడంతో పాటు అధికారులూ మన మాట వినేలా చేసుకోవాలి. మన మాట విననివారిని మార్చాలి.  విజయనగరం జిల్లాలో ఇప్పటికీ ప్రతిపక్ష నాయకులకే ఎక్కువగా పనులు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది. ఇకపై అలాంటి ఫిర్యాదులు రాకూడదు. వస్తే నా స్పందన ఎలా ఉంటుందో మీరు వూహించలేరు. మనం బలోపేతం కావడానికి నిత్యం ప్రయత్నించాలి. విపక్షాన్ని బలహీనం చేయాలి. వారికి అవకాశాలివ్వకూడదు...’

ఇదీ చంద్రబాబు తన పార్టీ జనాలకు చేసిన హితబోధ. ఎంత సగర్వంగా ప్రకటించుకున్నారు ఈ మాటలను.

అంటే అధికారులు అధికారపక్షం నాయకుల మాట వినకుంటే మార్చేయాలన్నమాట. ఈ మాటను స్వయంగా ముఖ్యమంత్రే చెబితే, ఇంక పాలనలో సమస్వామ్యం ఎక్కడుంటుంది?

పైగా ప్రతిపక్ష నాయకులకు పనులు జరుగడం సరికాదట. అది కూడా ముఖ్యమంత్రి నోట. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్లు కూడా ప్రజల్లోంచే కదా? అంటే ప్రజలు ఎన్నుకున్నా కూడా ప్రతిపక్ష నేతలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వకూడదన్నమాట. ఇంత కచ్చితంగా, ఇంత నిర్మొహమాటంగా, ఇంత బాహాటంగా ముఖ్యమంత్రే చెప్పిన తరువాత ఇంక ఏ అధికారి ధైర్యం చేస్తాడు? ఇకపై ఇలా జరిగితే తన స్పందన ఎలా వుంటుందో ఊహించలేరు అని ముఖ్యమంత్రి తర్జని చూపించి, బెదిరిస్తే ఇంక అధికారులు నిస్పక్షపాతంగా పని చేయడం ఎలా సాధ్యం అవుతుంది.

ఇవే డైలాగులు జగన్ నోట వచ్చి వుంటే ఇదే మీడియా ఎంత గగ్గోలు పెట్టి వుండేదో? ఎన్ని విడియోలు చానెళ్లలో హడావుడి చేసేవో? తెలుగుదేశం జనాలు ఎంత గొంతు చించుకునేవారో? బాబు చేస్తే రాజకీయం..జగన్ చేస్తే అరాజకీయం. జగన్ చేసినట్లు చేయకండి..బాబు చెప్పినట్లు చేయండి. అదే కదా మన తెలుగు మీడియా అచ్చేసి చాటేది?

Show comments