ములాయం..మొదలుపెట్టిన దగ్గరకే వచ్చాడు!

సమాజ్ వాదీ పార్టీ రాజకీయాలు లెక్క లేనన్ని మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. తండ్రీ కొడుకుల మధ్య సాగుతున్నట్టుగా అగుపిస్తున్న ఈ ఆధిపత్య పోరులో.. ఇప్పటికే చాలా బహిష్కరణలు, మళ్లీ వాటినే ఎత్తేయడాలు, క్షమాపణలు.. రాజీలు, రచ్చలు జరిగాయి. ఈ పరంపరలో మరోసారి ములాయం ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. అఖిలేషే తమ సీఎం అని, రాబోయే ఎన్నికలకు కూడా అఖిలేషే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడని ములాయం అన్నాడు! 

గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయం కొన్ని రోజుల కిందట ములాయం చేసిన ప్రకటనతోనే రచ్చ రాజుకుంది! అఖిలేష్ తో పెద్దగా సంప్రదింపులు లేకుండా, అతడి ప్రాధాన్యతలను పట్టించుకోకుండా.. అభ్యర్థుల జాబితాను ప్రకటించడం, అఖిలేష్ కు అంటూ ఏ నియోజకవర్గాన్నీ కేటాయించకపోవడం, అఖిలేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పకపోవడమే.. అనంతర పరిణామాలన్నింటికీ కారణం.

ఎన్నో జరిగిన తర్వాత ఇప్పుడు అఖిలేషే తమ సీఎం అభ్యర్థి అని ములాయం ప్రకటించాడు. అయితే.. ఈయన మాటను ఎవ్వరూ విశ్వాసంలోకి తీసుకోలేదు. మొన్నంతా ఢిల్లీలో కూర్చుని.. సమాజ్ వాదీ పార్టీ తనది అని, సైకిల్ గుర్తు తనది అని, అఖిలేష్ కు దానితో సంబంధం లేదు అని ములాయం వాదించాడు. ఎన్నికల కమిషన్ కు కూడా  ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. 

అయితే ఢిల్లీ నుంచి లక్నో వచ్చే సరికే మాట మారింది. అఖిలేష్ ను సీఎం అభ్యర్థి అని అనేశాడు. మరి ములాయంను ఎవ్వరైనా విశ్వాసంలోకి తీసుకుంటున్నారా, ఎవ్వరైనా ఈయన స్థిరంగా ఉంటాడని అనుకుంటున్నారా.. అనే విషయాలను పక్కన పెడితే, అసలు అఖిలేషే తండ్రిని విశ్వాసం లోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. పూటకో మాట మాట్లాడుతున్న ములాయం ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ములాయం ఇంతటితో సైలెంట్ అయితే ఫర్వాలేదు, లేకపోతే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం.. అని అఖిలేష్ వర్గం నుంచి ప్రకటన వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు! 

Show comments