భూమా, శిల్ప.. ముందునుయ్యి, వెనుక గొయ్యి!

మొత్తానికి ఫిరాయింపుదారులకు, ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి చేరిన వారికి మధ్య భలే ఫిట్టింగ్‌ పడింది. ఇప్పుడు ఇద్దరి పరిస్థితీ ముందు నుయ్యి  వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది. గెలిస్తే ఒక తలనొప్పి.. ఓడితే మరో తలనొప్పి.. అన్నట్టుగా ఉంది తెలుగుదేశంలో చేరిన శిల్పా, భూమా ఫ్యామిలీల పరిస్థితి. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్‌ రెడ్డి వర్గాల మధ్య ఎంత రచ్చ జరిగిందో, ఎన్ని ఫిర్యాదులు దాఖలయ్యాయో, బాబు దగ్గరే ఎన్ని పంచాయితీలు జరిగాయో వేరే వివరించనక్కర్లేదు. భూమా నాగిరెడ్డికి ప్రాధాన్యత దక్కితే సహించేది లేదని శిల్పావర్గం హెచ్చరిస్తోంది, భూమా మాత్రం వారిపై తనకున్న బలాన్ని అంతా ప్రయోగిస్తూ అణిచివేస్తూ వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో భూమా ధాటికి తట్టుకోలేక శిల్పా మోహన్‌ రెడ్డి, సోదరులు తెలుగుదేశం పార్టీని వీడే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న తరుణంలో.. తెలుగుదేశం అధినేత వ్యూహాత్మకంగా శిల్పా చక్రపాణి రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించాడు! వారికి ప్రాధాన్యతను ఇస్తున్నట్టే ఇచ్చి, పెద్ద పరీక్ష పెట్టాడు చంద్రన్న. ఇది ఒక రకంగా శిల్పా సోదరులకు విషమ పరీక్షే. అలాగే భూమాకు కూడా!

కర్నూలు జిల్లా ఎమ్మెల్సీని గెలిపించడానికి.. మంత్రి పదవికి  ముడిపెట్టడం ఇప్పటికే జరిగిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యాకే.. విస్తరణ అని బాబు గారు తమ వాళ్లకు చెప్పేశారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో గనుక శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీగా ఓడితే.. దాని ప్రభావం భూమా మీద పడుతుంది. ఎమ్మెల్సీని గెలిపించుకోలేని వాళ్లకు మంత్రిపదవి ఎలా ఇస్తాం? అని రేపు బాబు ప్రశ్నించడానికి అవకాశం ఉంది. దీంతో భూమా కూడా ఇప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి విజయానికి కృషి చేయాల్సిందే! అయితే.. అనునిత్యం కీచులాడుకునే వ్యక్తుల కోసం భూమా పని చేస్తాడా? చేయగలడా? 

అసలే కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం అంతంత మాత్రం. వాస్తవ బలాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ జిల్లాలో వైకాపా అభ్యర్థి సునాయాసంగా విజయం సాధిస్తాడు. ఎందుకంటే మెజారిటీ స్థానిక సంస్థల సభ్యులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచినవారు. ఇక్కడ వైకాపా తరపు నుంచి గౌరు వెంకటరెడ్డి ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నాడు.

అంటే.. అప్రజ్యాస్వామికంగా, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను బెదిరించి.. బతిమాలి.. కొని.. తెలుగుదేశం పార్టీ విజయం సాధించాల్సి ఉంది. ఇదీ.. భూమా, శిల్పా వర్గాలకు చంద్రబాబు పెట్టిన పరీక్ష. ఈ పరీక్షలో వీళ్లు గనుక ఓడితే.. ఇద్దరూ వృధా అని చంద్రబాబుకు క్లారిటీ వస్తుంది. తన్ని.. కొట్టి.. కొని.. ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేంత సత్తా వీళ్లకు లేదని బాబుకు క్లారిటీ వస్తుంది. మొత్తానికి కర్నూలు జిల్లా అసంతృప్త వాదులకు.. చంద్రబాబు నాయుడు అప్రజాస్వామిక పద్ధతిలో విజయం సాధించడం అనే పరీక్షను పెట్టాడు. ఏం జరుగుతుందో చూడాలి!

Show comments