దుఃఖం వేరు; దుమారం ఒక్కటే!

ఇద్దరు దుఃఖితులు. ఇద్దరు భారతీయులు. ఇద్దరు మహిళలు. భర్తను కోల్పోయి కొన్ని రోజులయిన యువతి ఒకరు. తన రెండేళ్ళప్పుడే తండ్రిని పోగొట్టుకున్న యువతి ఒకరు. ఒకరి పేరు సునయన దుమాల. మరొకరి పేరు గుర్మెహర్‌ కౌర్‌. ఈ రెండు పేర్లూ నేడు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో మార్మోగిపోతున్నాయి. 'గూగుల్‌' వంటి సెర్చ్‌ ఇంజన్లలో వీరి పేర్లపై అత్యధిక అన్వేషణ కొనసాగుతోంది. ఇద్దరూ తమ మనోవేదనల్ని జనం ముందు వుంచారు. సునయనభర్త శ్రీనివాస్‌ కూచిభొట్లను కొన్నిరోజుల క్రితమే అమెరికాలోని కాన్సాస్‌లో ఒక శ్వేతజాతీయుడు కాల్చివేశాడు. పద్దెనిమిదేళ్ళ క్రితం కార్గిల్‌ యుధ్ధంలో గుర్మహెర్‌ తండ్రిని కెప్టెన్‌ మణిదీప్‌ సింగ్‌ చనిపోయారు. రెండూ రెండు సందర్భాలు. రెండుచోట్లా ఉద్వేగాలున్నాయి. ఆ ఉద్వేగాలకు కీలకంగా దేశం, జాతీ వున్నాయి. 

శ్రీనివాస్‌ది తాజాఘటన ఆడమ్‌ డబ్ల్యు పురింటన్‌ అనే ఒక శ్వేతజాతీయుడు 'మా దేశాన్ని వదలిపొండి' అని హుంకరిస్తూ ఇద్దరు భారతీయ (తెలుగు) యువకుల మీద కాల్పులు జరిపేశాడు. ఇద్దరిలో శ్రీనివాస్‌ అక్కడికక్కడే చనిపోయాడు. అతని వయసు యాభయకి పైనే. ఒకప్పుడు అమెరికా నౌకాదళంలో పనిచేశాడు. పలు దేశాలకు సంబంధించిన వారు అమెరికాలో వుంటారని తెలుసు. అంతేకాదు. ఏదేశస్తులు ఎలా వుంటారో, వేష భాషలెలా వుంటాయో అంచనా వుండి వుండాలి. ఈ ఘటన బార్‌లో జరిగింది. కాబట్టి వారిని చాలా సేపు గమనించిన తర్వాతనే వారితో వాగ్వివాదానికి దిగివుండాలి. కానీ తర్వాత వారిద్దరూ 'మధ్య ప్రాచ్య (గల్ఫ్‌) దేశీయులు' అను కాల్చిపారేశాను అన్నాడు. 

 ఈ ఘటన అమెరికాలో వున్న భారతీయులనే కాదు, ఇక్కడ వున్న వారి బంధు మిత్రులను కూడా కలచి వేసింది. కానీ మరుసటి రోజునే సునయన తన భర్త గురించి మాట్లాడిన తీరు మరింత ఆలోచింప చేసింది. ఆమె దుఃఖాన్ని ఆపుకుంటూ తన భర్త అమెరికానూ, అక్కడి ప్రజల్నీ ఎంత ప్రేమించే వాడో చెప్పింది. తాను ఎన్నోమార్లు అమెరికా విడిచి వెళ్ళిపోదామన్నా సరే,  అమెరికాలో వుండాలని అంటూండే వాడనే విషయాన్ని గుర్తు చేసింది. ఉద్విగ్న భరితమైన తన ఆవేదనలో ఆమె ప్రశ్న వేసింది 'రంగును బట్టే అక్కడున్న వారు మధ్య ప్రాచ్యదేశానికి చెందిన వారనే నిర్ధారణకు వచ్చేస్తారా?' అన్నారు. ఈ ప్రశ్నలో అంతరార్థం చాలా వుంది. మధ్య ప్రాచ్యదేశాలు ముస్లిం దేశాలు. వాటిల్లో కొన్ని ముస్లిం దేశాల్లోనే ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారు. కానీ ఉగ్రవాద చర్యలకు ప్రపంచంలోని ఇతర దేశాల్లోని ప్రజలు చనిపోతున్నట్టుగా, ఆ దేశపు ప్రజలు  కూడా చనిపోతున్నారు. కానీ 'ముస్లిం అంటేనే టెర్రరిస్టు' అనే భావనని ఆమెరికాలో కల్పించటానికి ప్రయత్నించారు. ఇటీవల ట్రంప్‌ ఏడుముస్లిం దేశాలనుంచి అమెరికా వచ్చే పౌరుల మీద పెట్టిన నిషేధం ఈ ఆలోచనకు పరకాష్ట. 

సునయన ప్రశ్నలో వ్యక్తిగతం ఒక చిన్న ఆశ వుంది: తన భర్తను ఈ గల్ఫ్‌ దేశాలకు చెందిన ముస్లిం అని కాకుండా, భారతీయుడనో, హిందువనో గుర్తించివుంటే  వదలివేసేవాడని.  ఆ ఆశ ఆమెకే కాదు, భారతీయుల్లో అందరికీ వుంటుంది. కానీ ట్రంప్‌ ముస్లిందేశీయుల మీద ఎంత వ్యతిరేకత కలిగించారో, ఉద్యోగాలను అపహరించుకు పోతున్నారనే నెపం మీద భారతీయుల మీద కూడా అంతే వ్యతిరేకత కల్పించారు. కాబట్టి హంతకుడికి 'భారతీయత' నిరూపించటం ద్వారా కరుణ చూపే వాడేమో- అని అనుకోవటానికి తక్కువ ఆస్కారం వుంది. 

అమెరికాలో వుండే భారతీయులు, తమకు అక్కడ వున్న 'ఆఫ్రో ఆమెరికన్ల' (బ్లాక్స్‌) వల్ల ప్రమాదం వుందంటే నమ్మటానికి ఎప్పుడూ సిధ్ధంగా వుంటారు. అడిగిన వెంటనే ఒక డాలర్‌ ఇవ్వలేదని కూడా బ్లాక్స్‌ భారతీయులను కాల్చేసిన సందర్భాలున్నాయి. అలాగే అక్కడ వుండే 'ముస్లిం టెర్రరిస్టుల' వల్ల ప్రమాదం వుందంటే కూడా నమ్మటానికి సిధ్దంగా వుంటారు. డబ్ల్యుటీసీని పేల్చేసిన ఘటన అందరి అమెరికన్ల మనస్సులో ముద్ర వేసుకున్నట్టే, ప్రవాస భారతీయుల మనసులో కూడా వుండిపోయింది. కానీ అక్కడి 'వైట్స్‌' వల్లకూడా తమకు ప్రమాదం వుందని నమ్మటానికి సిధ్దంగా లేరు. అందుకనే 'నేను ఇండియన్‌ని' అని అక్కడున్న ఇద్దరిలో ఒక్క మాట చెప్పివుంటే వదలివేసేవారేమో నన్న భావన సునయనకీ, సునయన దుఃఖానికి కదలిపోయిన వారికీ వుంది. కానీ అదే సమయంలో 'ఈ దేశం వదలి వేరే దేశం వెళ్ళిపోదామా?' అని తానే తన భర్తకు సలహా ఇచ్చిన అంశాన్ని కూడా అమె ప్రస్తావించింది. అంటే భారతీయులకు మెల్ల మెల్లగా 'వైట్స్‌' నుంచి కూడా ప్రమాదం వుండి వుండచ్చన్న అనుమానం వున్నట్లే కదా!

ఇక గుర్మెహర్‌ కథనం భిన్నం. ఢిల్లీలోని రమ్జాస్‌ కళాశాలలో అల్లర్లు జరిగిన తర్వాత ఆమె ఒక పోస్ట్‌ పెట్టింది. ఈ కళాశాలలో వారంక్రితం ఒక సెమినార్‌లో మాట్లాడటానికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యూ) నుంచి  ఉమర్‌ ఖలీద్‌ అనే విద్యార్థిని ఆహ్వానించారు. ఏడాది క్రితం అతని మీద 'రాజద్రోహ' అభియోగం మోపారు. ఏ కోర్టు ఇంకా ధ్రువీకరించలేదు. అయితే అతన్ని పిలవటాన్ని అడ్డుకుంటూ ఎబివిపికి చెందిన విద్యార్థులకీ అక్కడ విద్యార్థులకూ మధ్య ఘర్షణలు జరిగాయి. ఇవి హింసాత్మకంగా మారాయి. అప్పుడే నేను 'నేను ఢిల్లీయూనివర్శిటీ . ఎబివిపి అంటే భయపడను' (ఈ యూనివర్శిటీలో ఎబివిపికి పట్టువుంది.) అంటూ గుర్మెహర్‌ కౌర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడుతూ తాను వివరాలు చెప్పింది. 'నేను పాకిస్తాన్‌నీ, పాకిస్తానీయులనూ ద్వేషిస్తూ పెరిగాను. వాళ్ళే నా తండ్రి మరణానికి కారణం అని భావించేదానిని. ఈ ద్వేషంతోనే నాకు ఆరేళ్ళ వయసున్నప్పుడు బురఖాలో వున్న మహిళను పొడవటానికి వెళ్లాను.  అప్పుడు అమ్మ చెప్పింది: నాన్నను చంపింది పాకిస్తాన్‌ కాదు; యుధ్ధమని.'  అంతేకాకుండా, ఎబివిపి దాడుల్ని ఖండించింది. ఒక దేశంలో పుట్టి పెరిగిన వారికందరికీ సమాన హక్కులంటాయని హెచ్చరించింది. 

ఇక్కడితో ఈ కథ ముగియలేదు. ఆమెకు 'జాతీయవాదం' లేదని తెంపుచేసి, ఆమెను అత్యాచారం చేస్తానంటూ బెదరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఈ విషయం ఆమే స్వయంగా చెప్పారు. ఈమెకు అనుకూలంగా, ప్రతికూలంగా కూడా రాజకీయ నేతల ప్రకటనలిస్తున్నారు. యుధ్ధం. అవును యుధ్ధం. ఇండియా పాకిస్తాన్‌ సరిహద్దుల్లో జరిగిన యుధ్ధం ఒకటయితే, ఆమెరికాలో భారతీయులకూ, అక్కడున్న శ్వేత జాతీయులకూ మధ్య జరుగుతున్న యుద్ధం ఒక్కటే. అమెరికాలో చంపిందెవరో స్పష్టంగా తెలుస్తున్నా, 'తెల్లవాళ్ళకున్న ద్వేషం' అని తెంపు చెయ్యలేక పోతున్నాం. కార్గిల్‌ యుద్ధంలో సరిహద్దు అవతల వున్న సైనికుల్నే కాకుండా, ప్రజల్ని కూడా శత్రువులుగా చూడగలుగుతున్నాం. 

శ్వేత జాతీయుల్లో మానవత్వం మూర్తీభవించిన వారున్నారని నమ్మగలగటానికి ఉదాహరణకూడా చూపించగలుగుతున్నాం. ఎందుకంటే ఈ కన్సాస్‌ కాల్పుల ఘటనలోనే ఇయాన్‌ గ్రిల్లెట్‌ అనే మరో శ్వేతజాతీయుడు ప్రాణాలకు తెగించి కాల్పులను నివారించే ప్రయత్నం చేశాడు. కానీ భారతదేశంలో వున్న ముస్లింలను కూడా 'వీళ్లు పాకిస్తాన్‌లో వుండవలసిన వాళ్ళనో' లేక 'పాకిస్తాన్‌లో వున్న సాధారణ పౌరులు సైతం శత్రువులనో' భావన నుంచి ఇక్కడి కొందరు 'దేశభక్తులు' బయిట పడలేకపోతున్నారు. 'ద్వేషం' మీద రాజకీయం చెయ్యటం మొదలు పెడితే, కొన్నాళ్ళకు 'ద్వేషమే' యుధ్ధమయి కూర్చుంటుంది. ఈ ఇద్దరి మహిళల్లా మరే భారతీయులూ దుఃఖించకుండా వుండాలంటే, ఇంటా, బయిటా 'ద్వేష రాజకీయాలను' వ్యతిరేకించగలగాలి. 


-సతీష్ చందర్ 

Show comments