రోజాకి ఎంట్రీ వుంటుందా.? లేదా.?

కాల్ మనీ సెక్స్ రాకెట్ కుంభకోణంపై చర్చ సందర్భంగా జరిగిన రచ్చ నేపథ్యంలో అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన విమర్శలే చేశారు. కామ సీఎం (కాల్ మనీకి షార్ట్ కట్ అట) అంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. పాలక, ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. చివరికి రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేసేశారు. ఇది 2015 డిసెంబర్‌ నాటి విషయం. కోర్టులు, విచారణలు.. ఇలా పెద్ద తతంగమే నడిచింది. కానీ రోజా అసెంబ్లీలోకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఏడాది పాటు సస్పెన్షన్‌.. అది ఇప్పటికే ఏడాది పూర్తయిపోయింది గనుక, అమరావతిలో మార్చ్‌ 6 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో రోజా పాల్గొనడానికి మామూలుగా అయితే ఎలాంటి ఇబ్బందులూ లేనట్టే. 

కానీ, ఇక్కడే ఇంకో మెలిక వుంది. రోజా మరో వివాదంలో కూడా ఇరుక్కున్నారు. అదీ ఆనాటి వ్యవహారమే. ఈసారి, రోజా విమర్శల వ్యవహారం టీడీపీ ఎమ్మెల్యే అనితపైన. తన వ్యక్తిగత జీవితంపై దారుణమైన ఆరోపణలు చేశారంటూ అసెంబ్లీలో కంటతడి పెట్టారు అనిత. 'నాకు న్యాయం కావాలి..' అంటూ అనిత, అసెంబ్లీలో కంటతడిపెట్టడంతో, ఆ ఘటనపై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా శాసనసభ తీర్మానం చేసేసింది. 

ప్రివిలేజ్‌ కమిటీ ముందు రోజా హాజరయ్యారు.. తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. పలు సందర్భాల్లో రోజా, అనితను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందనీ, తనలానే అనితనీ టీడీపీ రాజకీయంగా వాడుకుని వదిలేస్తుందనీ చెబుతూ వస్తున్నారు. అదంతా వేరే విషయం. ఈ వ్యవహారంలో, బేషరతుగా క్షమాపణ చెప్పలేదని ప్రివిలేజ్‌ కమిటీ తాజాగా తేల్చింది. ఆ నివేదిక, మార్చ్‌ 7న అసెంబ్లీలో ప్రవేశపెడతారట. అంటే, ఇంకో ఏడాది రోజాపై ససెన్షన్‌ వేటు తప్పకపోవచ్చన్నమాట. కొత్త రాష్ట్రం.. సొంత అసెంబ్లీ.. అదీ కొత్తగా కట్టుకున్న అసెంబ్లీలో తొలి సమావేశాలు.. అందులో, పాల్గొనేందుకు రోజాకి అవకాశం ఇవ్వకుండా చేసేందుకు అధికార పార్టీ ఈ ఎత్తుగడ వేసిందని అనుకోవాలేమో.!

Show comments