తాజాగా ఇద్దర్ని మింగేసిన మోడీ 'విజన్‌'.!

పెద్ద పాత నోట్ల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇప్పటిదాకా 100 మందికి పైగానే మృత్యువాత పడ్డారు. బ్యాంకులు, ఏటీఎం క్యూలైన్లలో 2 వేల రూపాయల కోసం పడిగాపులు కాచి ప్రాణాలొదిలినవాళ్ళే వీళ్ళలో చాలామంది. ఒకరిద్దరు బ్యాంకు ఉద్యోగులు సైతం, ఈ పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని పెరిగిన ఒత్తిడితో విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయారు. 

తాజాగా, నరేంద్రమోడీ 'పైత్యం' కారణంగా, మరో ఇద్దరు బలైపోయారు. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే కావడం గమనార్హం. గుంటూరు జిల్లాలో ఒకరు, చిత్తూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకున్నారు.. బ్యాంకుల వద్ద పడిగాపులు కాయలేక. రోజుల తరబడి పెన్షన్‌ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, ప్రభుత్వ నిర్ణయంతో తమ ప్రాణాలు పోతున్నాయంటూ వాపోతున్నారు. అయినా, జీవనానికి వేరే ఆధారం లేక, బ్యాంకులకు రావాల్సి వస్తోందని కన్నీరుమున్నీరవుతున్నారు వారంతా. 

తప్పదు, 50 రోజులు కష్టాలు భరించాల్సిందే.. అంటూ, ఈ తరహా మరణాల్ని ఎప్పుడో లైట్‌ తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 'ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు..' అని చెబుతున్న మోడీ, ఆ ప్రజల్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతుండడం దారుణాతిదారుణమైన విషయం. దేశ ప్రజలెవరూ పెద్ద నోట్ల రద్దుని వ్యతిరేకించడంలేదు. కానీ, పెద్ద నోట్ల రద్దు తర్వాత, 'మీ చావు మీరు చావండి..' అన్నట్లుగా ప్రజల కష్టాల్ని పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణం. 

బ్యాంకుల వద్ద టెంట్లు, క్యూలైన్లలో ఉన్నవారికి సపర్యలు.. అంటూ బ్యాంకులు చెబుతున్న మాటలకీ, ప్రభుత్వం చెప్పే కథలకీ, జరుగుతున్న దారుణాలకీ అసలు పొంతనే వుండడంలేదు. 

నల్ల కుబేరులకేమో కట్టలకు కట్టలు కొత్త పెద్ద నోట్లు చేరిపోతున్నాయి.. సామాన్యులేమో, ఒక్క నోటు కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇది కదా నరేంద్రమోడీ విజన్‌.!

Show comments