ముద్రగడను మనమే హీరో చేసేస్తున్నాం సార్!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నాడు రెండు కీలక సమావేశాలు నిర్వహించారు. ఒకటి తాను మరియు కుమారుడు లోకేష్ కలిసి నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం, రెండోది కేబినెట్ భేటీ. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో... చంద్రబాబు పార్టీలో పెచ్చరిల్లుతున్న క్రమశిక్షణ రాహిత్యం గురించి చెలరేగిపోయినట్లుగా లీకులు వచ్చాయి. శ్రీకాకుళం తగాదాలు, గుంటూరు తగాదాలు వీటి మీద ఆయన పార్టీ నేతల్ని హెచ్చరించినట్లుగా చెప్పుకున్నారు. అయితే ఆఫ్ ది రికార్డ్ గా మరో సంగతి ఏంటంటే.. సాక్షాత్తూ ముఖ్యమంత్రితో ఎవరూ ప్రస్తావించకపోయినప్పటికీ.. పార్టీనేతల మధ్య ముద్రగడ తలపెట్టిన కాపు పాదయాత్ర వ్యవహారం కూడా ప్రధానంగా చర్చకు వచ్చిందిట. 

కాపు వర్గం కోసం ముద్రగడ పాదయాత్ర చేయదలచుకున్నారు. ఓసారి పర్మిషన్ ఇచ్చేసి, ఆ యాత్రలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత పెడితే అక్కడితో వ్యవహారం ముగిసిపోతుంది కదా.. అనుమతులు నిరాకరించడం ద్వారా మనమే ఆయనను హీరోగా చేసేస్తున్నాం అంటూ నాయకులు తమలో తాము గుసగుసలాడుకున్నారుట. చీటికి మాటికి ఆయన యాత్ర చేస్తా అంటూ బయల్డేరడం, జాతికోసం నేను ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం, నా జాతికి మంచి జరిగితే చాలు.. నా ప్రాణాలు పోయినా పర్లేదు అంటూ తనను తాను త్యాగపురుషుడిగా అభివర్ణించుకోవడం.. ఆ వెంటనే పోలీసులు హౌస్ అరెస్టు చేసేసి ఆయన రొటీన్‌గా చెప్పే మాటలకే మరింత పబ్లిసిటీ దక్కేలా పరోక్షంగా సహకరించడం ఒక రివాజుగా మారిపోయిందని పచ్చ నాయకులే తమలో తాము కుమిలిపోతున్నారట.

యాత్రకు ఒక్కసారి పర్మిషన్ ఇచ్చేస్తే.. ముద్రగడ ఇన్నిసార్లు ప్రభుత్వాన్ని మీడియా ముందు తిట్టడానికి అవకాశమే లేకుండాపోయేది. ప్రతిసారీ హౌస్ అరెస్టు లాంటి ప్రహసనం నడిపించడం వల్ల.. ఏదో మనం కాపు వర్గాన్ని అణచివేస్తున్నాం అనే ప్రచారానికి మనమే ఊతమిస్తున్నట్లుగా ఉన్నది.. అంటూ తెదేపాలోని కొందరు నాయకులు తమలో తాము చెవులు కొరుక్కున్నారుట. పార్టీకి ఇది చాలా చేటుచేస్తుందని అనుకున్నారుట. పార్టీకి ఎంత చేటు జరిగినా సరే, అధినేత నిర్ణయాల్లో లోపాన్ని ఆయన ఎదుట చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు గనుక.. సమన్వయ కమిటీ ఆన్ రికార్డ్ చర్చల్లోకి రాకుండానే ఈ వ్యవహారం మరుగున పడిపోయిందిట మరి!
ఎంత చెడ్డా.. ముద్రగడ వ్యవహారంలో ప్రభుత్వం ఎలా తలపోస్తున్నదో గానీ.. పనిగట్టుకుని కాపు వ్యతిరేక పోకడల్తో తొక్కేస్తున్నారనే ప్రచారం జరగడానికి ఈ అనుమతి నిరాకరణలు కారణం అవుతుండడం నిజమేనని పలువురు అనుకుంటున్నారు. 

Show comments