వాట్‌ ఈజ్‌ దిస్‌ చంద్రబాబూ.!

నిజం నిప్పులాంటిది. కానీ, ఆ నిజం.. చంద్రబాబు చెప్పుకునే 'నిప్పు' లాంటిది కాదు. ఆ నిప్పు వేరే, చంద్రబాబు చెప్పుకునే నిప్పు వేరే. నిప్పుకి అర్థాన్ని మార్చేసిన ఘనుడు నారా చంద్రబాబునాయుడు. రాజకీయ వేదికలపై ఏమైనా మాట్లాడొచ్చుగాక. చంద్రబాబు రాజకీయ నాయకుడుగనుక, రాజకీయ వేదికలపై ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఆ మాటల్ని పార్టీ నాయకులు వింటారు.. వినక తప్పదు. కానీ, అధికారులకేం ఖర్మ.. ఆయన చెప్పే 'తుప్పు' మాటల్ని వినడానికి.? 

అధికారులతో ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారంపై స్పందించారు. పనిలో పనిగా, అవినీతిపైనా మాట్లాడేశారు. భారతదేశం చాలా గొప్పదేశమని ప్రతి ఒక్కరూ అంగీకరించాలన్నారు. ఇంత గొప్ప దేశంలో, ఈ అవినీతి ఏంటి.? ఎన్నికల సమయంలో 500, 1000 రూపాయల నోటు పంచడమేంటని ప్రశ్నించేశారు.! 

మామూలుగా అయితే 'వాట్‌ నాన్సెన్స్‌ ఆర్‌ యూ టాకింగ్‌.?' అంటూ చంద్రబాబుని, అధికారులు నిలదీసెయ్యాలి. కానీ, నిలదీయలేరు. ఎందుకంటే, అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో వున్నారు. అందుకే, చంద్రబాబు ఆటలు చెల్లాయి. వినేటోళ్ళు వెర్రి వెంగళప్పలయితే చెప్పేటోడు సిద్ధాంతి.. అన్నది వెనకటికి ఓ నానుడి. ఇక్కడ, దాన్ని ప్రస్తావించుకోవాలి. 

ఎన్నికల్లో డబ్బుల ఖర్చు గురించి చంద్రబాబే మాట్లాడాలి మరి.! ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టడానికి తయారయ్యింది తెలుగుదేశం పార్టీ. ఇందుకోసం ఐదు లక్షలకు ఓ ఎమ్మెల్యే ఓటుని కొనెయ్యడానికి సిద్ధపడ్డ టీడీపీ, ముందుగా 50 లక్షల అడ్వాన్స్‌ కూడా ఇచ్చింది. ఈ అడ్వాన్స్‌ ఇచ్చిన ప్రక్రియ అంతా ఆన్‌ రికార్డెడ్‌. వీడియో సాక్ష్యాలున్నాయి. అడ్డంగా దొరికిపోయింది టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి. ఈ ఎపిసోడ్‌లో మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాత్ర వుంది. చంద్రబాబు స్వయంగా ఈ 'కొనోగులు'కి 'బ్రీఫింగ్‌' చేశారన్నది జగమెరిగిన సత్యం.  Readmore!

ఇప్పుడు చెప్పండి, అధికారులంతా కలిసి 'వాట్‌ ఈజ్‌ దిస్‌ చంద్రబాబూ..' అంటూ నిలదీయాలా వద్దా.? దేశం చాలా గొప్పది. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నది రాజకీయ నాయకులే. దురదృష్టవశాత్తూ ఆ రాజకీయ నాయకులే మళ్ళీ నీతులు చెబుతారు. విద్యాధికులైన అధికారులూ సోకాల్డ్‌ పొలిటీషియన్లు చెప్పే 'అవినీతి కబుర్ల'ను వినక తప్పని ఖర్మ, ఇంకేదన్నా దేశంలో వుంటుందా.? ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా.

Show comments