కేసీఆర్‌.. కూలీ నెంబర్‌ వన్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 'కూలీ నెంబర్‌ వన్‌' కాబోతున్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ లోపు ఏ రోజైనా, కేసీఆర్‌ని 'కూలీ' గెటప్‌లో చూడాల్సి రావొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్‌ వెల్లడించారు. 'కూలీ అవతారం' అంటే, ఇంకోటేదో అనుకునేరు.. జస్ట్‌, ఆయన అలా ఓ పాన్‌ దుకాణానికి వెళ్ళి, పాన్‌ కట్టొచ్చు. లేదంటే, ఇంకెక్కడికన్నా వెళ్ళి తట్టతో మట్టిని ఎత్తొచ్చు. ఇవేవీ కాదనుకుంటే, రోడ్ల మీదకొచ్చి కాస్సేపు చీపురు పట్టుకుని ఊడ్చేయొచ్చు. 

రాజకీయ నాయకులన్నాక ఇలాంటి 'వేషాలు' వేయడం మామూలే. అయితే, ఇందులోనూ కేసీఆర్‌, తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఉద్యమ కాలంలో, పార్టీ నిర్వహించే బహిరంగ సభలకు నిధుల్ని రాబట్టడం కోసం కేసీఆర్‌ కూలీ అవతారమెత్తిన సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 'గౌరవ కూలీ' కింద వేలు, లక్షలు చెల్లించేస్తుంటారు. కేసీఆర్‌ అడగాలేగానీ, లక్షలేం ఖర్మ, కోట్లు వచ్చిపడ్తాయి. 

కేసీఆర్‌ ఒక్కరే చేయడం కాదు, ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు వీలు చూసుకుని 'కూలీ' చేయాలంటూ ఆదేశాలు జారీ చేసేశారాయన. అలా వచ్చిన మొత్తం చేతపట్టుకుని త్వరలో టీఆర్‌ఎస్‌ నిర్వహించే ప్లీనరీ, బహిరంగ సభకు వాహనాలు సమకూర్చుకుని రావాల్సిందిగా కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

కాయ్‌ రాజా కాయ్‌.. కేసీఆర్‌కి లభించబోయే కూలీ ఎంత.? లక్ష.? కోటి.? అంతకు మించి.! అని అప్పుడే బెట్టింగ్స్‌ షురూ చేసేయొచ్చు. కేసీఆర్‌ మీదనే కాదు, ఆయనగారి పుత్రరత్నం, అదేనండీ మంత్రి కేటీఆర్‌కి దక్కే కూలీ ఎంత.? హరీష్‌రావు ఎంత కూలీ సంపాదిస్తారు.? ఇలాంటి అంశాల చుట్టూ బెట్టింగ్‌లు షురూ అవుతాయిక.

Show comments