బిగ్ బజార్లలో డబ్బులు డ్రా.. పెద్ద స్కామేనా?

ఏంటిది? ఏం జరుగుతోంది? ఒకవైపు నోట్లు లేవురా పరమాత్మా.. అని చాలా చోట్ల బ్యాంకుల తలుపులు వేస్తుంటే, ఇంకోవైపు తమ ఔట్ లెట్ల నుంచి డెబిట్ కార్డును ఉపయోగించుకుని ఒక్కో కస్టమర్ రోజుకు రెండు వేల రూపాయలు డ్రా చేసుకోవచ్చని ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించింది!

బిగ్ బజార్ ఔట్ లెట్లలో ఏమిటి? డబ్బు డ్రా చేసుకోవడం ఏమిటి? ఏమైనా ఫ్యూచర్ గ్రూప్ ప్రభుత్వ రంగ సంస్థనా? లేక బిగ్ బజార్లలో కొత్త నోట్లు ముద్రిస్తున్నారా? ఏ సాధికారతతో బిగ్ బజార్ ఈ విషయాన్ని ప్రకటించింది? బ్యాంకుల్లోనే లేని డబ్బు బిగ్ బజార్లకు ఎక్కడ నుంచి వస్తోంది? అనేవి సామాన్యుడికి కలిగే సందేహాలు!

ఇప్పుడు సమస్య అంతా.. బ్యాంకులు లేక కాదు, బ్యాంకుల్లో నోట్లు లేక! నోట్లు ఉంటే బ్యాంకర్లు కస్టమర్లకు ఇవ్వగలరు. అవసరానికి తగినంత కరెన్సీని ఇవ్వలేక ప్రభుత్వం, ఆర్బీఐ చతికిల పడింది.

ఇలాంటి నేపథ్యంలో చాలా చోట్ల బ్యాంకర్లు తలుపులేసుకుంటున్నారు. క్యాష్ లేదు అని చెబుతున్నారు. ఇప్పటికే సాఫ్ట వేర్ అప్ డేట్ అయిన పదిశాతం ఏటీఎంలకు కూడా క్యాష్ లేదు! ఈ సంగతంతా ఇలా ఉంటే.. బిగ్ బజార్ మాత్రం ఒక్కో కస్టమర్ కు రోజుకు రెండు వేల రూపాయల క్యాష్ ఇస్తుందట! అదేమంటే.. ఎస్బీఐతో టై అప్ అంటున్నారు!

తమ బ్రాంచులకు, అప్ డేట్ అయిన ఏటీఎం మిషన్లకూ క్యాష్ ను సర్దలేకపోతున్న ఎస్బీఐ బిగ్ బజార్ కు ఎలా డబ్బులిస్తోందో  తల బద్ధలు కొట్టుకున్నా అర్థం కాని అంశం.

115 టౌన్లు, సిటీల్లో 258 బిగ్ బజార్ ఔట్ లెట్లు ఉన్నాయట. వీటిల్లో కనీసం ఒక్కో ఔట్ లెట్ లో రోజుకు ఐదువందల మంది కస్టమర్లు డబ్బులు డ్రా చేసుకుంటారు అనుకున్నా.. పదిలక్షల క్యాష్. 258 ఔట్ లెట్లలో ఇదే రీతిన జరిగితే.. 25.80 కోట్ల రూపాయలు కావాలి! ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంత పెద్ద మొత్తమో.. చెప్పనక్కర్లేదు!

బ్యాంకులకూ, ఏటీఎంలకు డబ్బులు సర్దలేని స్థితిలో బిగ్ బజార్లకు మాత్రం రోజుకు అన్ని కోట్లు సర్దుతారా? లేక.. ఫ్యూచర్ గ్రూప్ ప్రత్యేకంగా నోట్లను ముద్రించేసి పంచుతుందా?

అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆర్థిక లావాదేవీలను ఒక ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పజెప్పుతారు? చెప్పితిరిపో.. కేవలం ఫ్యూచర్ గ్రూప్ రీటైలర్ కు మాత్రమే ఎందుకు ఈ అవకాశం? మిగతా వాళ్లకు ఎందుకు ఇవ్వడం లేదు?

ఆల్రెడీ అధికార కూటమిలోని  కొందరు ముఖ్యులకు ఫ్యూచర్ గ్రూప్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. నోట్ల రద్దుకు కొన్ని గంటల ముందు.. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ రీటెయిల్ కు  ఫ్యూచర్ గ్రూప్ కు భారీ ఒప్పందమే జరిగింది. అలాగే పతంజలి రాందేవ్ వ్యాపారాలకూ ఫ్యూచర్ గ్రూప్ కు కూడా వ్యాపార సంబంధాలున్నాయి.

ఈ నేపథ్యంలో.. ఫ్యూచర్ గ్రూప్ ద్వారా నగదు పంపిణీ అనేక అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఏదైనా కుంభకోణం ప్రణాళిక ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవైపు బ్యాంకులకు క్యాష్ సర్దుబాటు చేయలేని ఈ సమయంలో.. ప్రైవేట్ గ్రూప్ కు ఎలా రోజుకు యాభై కోట్ల రూపాయల పై స్థాయి డబ్బు ఇస్తారు? దీన్ని నివృతి చేసే ఆర్థిక వేత్తలెవరు? 

ఎలాంటి సాధికారత లేని ప్రైవేట్ రీటైలర్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తన దగ్గర ఉన్న నల్లధనాన్ని తెలుపుగా మార్చుకుంటే అడిగేదెవరు? ప్రభుత్వానికి కావాల్సిన వాళ్ల నల్లధనాన్ని ఈ విధంగా వైట్ చేసే కుంభకోణం కాదా ఇది? 

Show comments