తమిళనటులు.. గొడవలతో రచ్చ రచ్చ!

తమిళనాట సినీ నటుల మధ్య సంఘం గొడవలు కొనసాగుతున్నాయి. కొన్నాళ్ల కిందట నడిగర్ సంఘం ఎన్నికలతో  వీధికెక్కిన విబేధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు నడిగర్ సంఘంలో ఏక ఛత్రాధిపత్యాన్ని కొనసాగించిన శరత్ కుమార్ – రాధా రవి కూటమికి, వీరిని ఓడించి సంఘంపై పట్టు సాధించిన నాజర్- విశాల్- కార్తీల ప్యానల్ చుక్కలు చూపుతోంది.

సంఘం మాజీ అధ్యక్షుడు శరత్ కుమార్, సెక్రటరీగా ఉండిన రాధారవిల ప్రాథమిక సభ్యత్వాలను కూడా రద్దు చేస్తూ ప్రస్తుత అధ్యక్షుడు నాజర్, సెక్రటరీ విశాల్, ఇతర ముఖ్య సభ్యులు కార్తీ, కరుణాస్ లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వీరు ఒక తీర్మానం పెట్టి ఆమోదింపజేసి.. విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

శరత్- రాధారవిలు తమ చేతిలోని అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవకతవకలకు పాల్పడ్డారని.. భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని అని, ఈ విషయంలో ఆధారాలున్నాయని, దీంతోనే వారికి సంఘం ప్రాథమిక సభ్యత్వాలను కూడా రద్దు చేస్తున్నామని.. నాజర్- విశాల్- కార్తీలు ఉమ్మడిగా ప్రెస్ మీట్లో ప్రకటించారు. ఇది వరకూ వారి సభ్యత్వాలను రద్దు చేస్తామన ప్రకటించగా.. ఇప్పుడు తీర్మాన సహితంగా వారిని సంఘం నుంచి బయటకు పంపారు.

ఈ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే కొంతమంది విశాల్, కరుణాస్ ల కార్ల మీద దాడికి పాల్పడటం విశేషం. సంఘం ఆఫీస్ ఆవరణలోని వాళ్ల కార్లపై రాళ్లు రువ్వి వాటిని ధ్వంసం చేశారు. నటుడు కరుణాస్ తమిళనాడులోని అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా. నాజర్ ప్యానల్ లోని సభ్యుడే అయిన అతడి కారుపై, విశాల్ కారుపై దాడి జరగడం  వెనుక.. శరత్ కుమార్ కుటుంబీకులు ప్రోద్బలమే ఉండవచ్చనే అభిప్రాయాలు సహజంగా కలుగుతాయి. మొత్తానికి తమిళ సినీ నటుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నట్టే. 

Show comments