రాజమౌళి కోసం 'క్యూ' కట్టేస్తున్నారు

'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమా సాధించిన విజయంతో పలువురు అగ్రహీరోలు, యంగ్‌ హీరోలు రాజమౌళి చుట్టూ చక్కర్లు కొడ్తున్నారు. రాజమౌళిని అభినందనలతో ముంచెత్తేయడమే కాదు, తమతో సినిమా చేయాలంటూ రాజమౌళిపై ఒత్తిడి పెంచేస్తున్నారు. తప్పదు మరి, 'బాహుబలి ది కంక్లూజన్‌' అందుకున్న విజయం అలాంటిది.! 

టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ హీరో అయితే, ఒకప్పుడు రాజమౌళితో సినిమా చేసే అవకాశాన్ని కాదనుకున్నందుకు ఇప్పుడు తీరిగ్గా కుమిలిపోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అఫ్ కోర్స్ ’శివగామి‘ పాత్రను వదిలేసుకున్న శ్రీదేవి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి.. అది వేరే విషయం. మరోపక్క, పలువురు బాలీవుడ్‌ యంగ్‌ హీరోలు, సీనియర్‌ హీరోలు రాజమౌళితో సినిమా చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారట. రాజమౌళి తదుపరి ఏ సినిమా చేస్తాడు.? అన్నదానిపై క్లారిటీ లేకపోయినా, రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ మాత్రం తనదగ్గర 'ఛత్రపతి శివాజీ' సహా పలు కథనలు సిద్ధంగా వున్నాయని చెబుతుండడంతో, ముందుగా విజయేంద్రప్రసాద్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు సదరు హీరోలు. 

'బాహుబలి'కి కొనసాగింపు వుండదని రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు. 'ఈగ' సీక్వెల్‌ ఆలోచన విరమించుకున్నాననీ చెప్పేశాడు. ముందు ముందు ఏ సినిమా చేయబోతున్నానన్నదానిపై సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాడు. 'మహాభారతం' సినిమా మాత్రం తీస్తానంటున్నాడు. అయితే, అది పదేళ్ళ తర్వాతేనని క్లారిటీ ఇచ్చేశాడు. 

ఏమో, రాజమౌళి నెక్స్‌ట్‌ ఏం సినిమా చేస్తాడోగానీ, రాజమౌళిని ప్రసన్నం చేసుకునేందుకు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు చూపిస్తున్న ఆసక్తి.. భలే 'కిక్‌' ఇస్తోంది కదూ.!

Show comments