సైకిల్ పార్టీలో అలజడికి కారణమతడేనా?

ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ పోరులు కొత్తేమీ కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఎన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలున్నాయో.. ఆ పార్టీల ను ప్రారంభించిన వారి అవసాన దశలో దానిపై అధిపత్యం కోసం కొడుకులు, అల్లుళ్లు,  నేతల రెండో భార్యలు.. ఇలా వీళ్లంతా కొట్టుకు చావడం, మామలకే వెన్నుపోట్లు పొడవడం, ఔరంగజేబుల్లా అధికారాన్ని చేజిక్కించుకోవడం..ఇవేవీ కొత్త కాదు.

తమిళనాట ఎంజీఆర్ స్థాపించిన పార్టీలో, తెలుగునాట ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో.. ఇలాంటి గొడవలు చెలరేగాయి. అలాగే కరుణానిధి కుటుంబ పార్టీ గా మారిన డీఎంకేలో వారసత్వ పోరు తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇక ఏపీలో గత ఎన్నికల్లో తెలుగుదేశం గనుక ఓడిపోయుంటే… ఈ పార్టీ వారసత్వం విషయంలో బీభత్సమైన రచ్చ జరిగే అవకాశం ఉండేది. అయితే మొన్నటి ఎన్నికల్లో గెలవడం తో టీడీపీ పూర్తిగా చంద్రబాబు ప్రైవేట్ ప్రాపర్టీగా మారిపోయింది.

ఈ సంగతిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ లో రచ్చ విపరీత స్థాయికి చేరింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అంతా బాగుందని అనిపించాల్సిన యాదవ్ లు.. ఇన్ని రోజులూ నివురు గప్పిన నిప్పుల్లా ఉండి, ఇప్పుడు భగ్గుమంటున్నారు.

ములాయం సోదరులకు, ములాయం తనయుడికి మధ్య రేగిన చిచ్చు క్రమంగా పెద్దది అవుతోంది. పార్టీ చీలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నయ్య తనకు పార్టీ అధ్యక్ష పదవినే ఇచ్చినా.. దానికి రాజీనామా చేశాడు శివపాల్ యాదవ్. తను పార్టీకి , మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించాడు. ఆయనతో పాటు సంఘీభావంగా భార్య, తనయుడు కూడా రాజీనామా చేశారు.

అయితే శివపాల్ యాదవ్ రాజీనామాను తిరస్కరిస్తున్నట్టుగా అఖిలేష్ ప్రకటించాడు. బాబాయ్ కి శాఖలు కత్తిరించిన అఖిలేష్ ఇప్పుడు ఆయనను పార్టీలో నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుండటం విశేషం. ఇక ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. పరోక్షంగా అమర్ సింగ్ పై ధ్వజమెత్తాడు. తమ కుటుంబంలో ఈ విబేధాలన్నింటికీ అమరే కారణం అన్నట్టుగా మాట్లాడాడు ఈయన. ములాయం అందరితోనూ మాట్లాడి,వివాదం సద్దుమణిగేలా చేయాలని రాంగోపాల్ సూచించాడు. 

ఇది వరకూ అఖిలేష్ తనకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని రాంగోపాల్ యాదవ్ ఫీలయ్యేవాడు. ఇప్పుడు ఈయన అఖిలేష్ కు మద్దతుగా నిలుస్తున్నాడు. ఇటీవల అమర్ సింగ్ చేరిక అనంతరం.. ఈ యూపీ సైకిల్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. అఖిలేష్ కు అమర్ చేరిక ఏ మాత్రం ఇష్టం లేదు. ములాయం మాత్రం దగ్గరుండి  అమర్ ను పార్టీలోకి చేర్చుకున్నాడు. అక్కడ నుంచి తండ్రీ కొడుకుల మధ్య విబేధాలు మొదలయ్యాయి. మరి ఇప్పుడు ఇవి ఏ దరికి చేరతాయో!

Show comments