ఆర్కేనగర్ నుంచి బీజేపీ.. ఈ నటీమణి పోటీ?

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బరిలోకి దిగడానికి తమిళ రాజకీయ పార్టీలు ఉత్సాహంగా ఉన్నాయని వేరే చెప్పనక్కర్లేదు. జయ మరణానంతరం తమిళ రాజకీయాలు పలు మలుపులు తిరగడంతో ఆర్కే నగర్ ఉపఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా కూడా మారాయి. ఇలాంటి నేపథ్యంలో పార్టీల వారీగా, గ్రూపుల వారీగా అభ్యర్థులు రెడీ అయిపోతున్నారు.

ఈ పరిణామాల మధ్య భారతీయ జనతా పార్టీ కూడా ఆర్కేనగర్ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటోందని సమాచారం. ఇక్కడ నుంచి అభ్యర్థిని బరిలోకి దించడానికి ఉత్సాహంగా ఉన్న బీజేపీ.. అందుకు తగిన వ్యక్తిగా గౌతమిని పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆర్కేనగర్ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా ఆమెను బరిలో నిలపునుందట కమలం పార్టీ. 

ఒకవైపు జయలలిత మేనకోడలు దీప ఈ ఎన్నికలతో తన భవితవ్యానికి పెద్ద పరీక్షను పెట్టుకుంటోంది. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే ఈ ఎన్నికల్లో గెలిచి అన్నాడీఎంకే ప్రత్యామ్నాయ శక్తి తామే అని చాటాలని భావిస్తోంది. ఇక శశికళకు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టగా మారాయి. ఆమె టీటీవీ దినకరణ్ ను అన్నాడీఎంకే రెండాకుల గుర్తు మీద బరిలో దింపి సత్తా చాటాలని భావిస్తోంది. ఇంకోవైపు పన్నీరుసెల్వం వర్గం కూడా అసలు అన్నాడీఎంకే తమదే అని చాటడానికి ఈ ఉపఎన్నికలే అవకాశం అని భావిస్తోంది. 

మరి ఈ మదగజాల నడుమ బీజేపీ, గౌతమిల పరిస్థితి ఎలా ఉంటుందో చాలా స్పష్టంగానే అర్థం అవుతోంది. జయలలిత ఉన్నప్పుడు ఆర్కేనగర్ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయగా.. కనీసం వందల్లో కూడా ఓట్లురాలేదు.. మరి ఇప్పుడేం జరుగుతోందో!

Show comments