ఒక విజయం ఇచ్చే నైతిక మద్దతు మరేదీ ఇవ్వలేదు. అలాగే ఓ పరాజయం అందించే మానసిక బలహీనత ఇంతా అంతా కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ది రెండో పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి పెద్దగా ప్రయత్నించడం లేదు. అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీది మొదటి తరహా. కాంగ్రెస్ పార్టీ తన బలహీనతను పోగొట్టకునే ప్రయత్నం ఎలాగైతే చేయడం లేదో, తెలుగుదేశం పార్టీ కూడా తన నైతిక బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నమూ చేయడం లేదు. తెలంగాణకు ఆంధ్రకు అదే తేడా.
కేసిఆర్ అధికారంలోకి వచ్చాక, ఆయన అనుకోకుండానో, అవసరం అయ్యో బోలెడు ఎన్నికలు ఫేస్ చేసారు. అన్నింటిలో విజయం సాధించుకుంటూ వచ్చారు. దీంతో కేసిఆర్ కు భరోసా పెరిగింది. కాంగ్రెస్ కు మరింత నీరసం పెరిగింది. కానీ ఇదే అవకాశం వస్తున్నా బాబు మాత్రం అందిపుచ్చుకోవడం లేదు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బకాయి వున్నాయి. వాటిని ఫేస్ చేసి, తన స్టామినా నిరూపించకుని, కాంగ్రెస్, వైకాపాలను మరింత బలహీన పర్చాలని చంద్రబాబు అస్సలు అనుకోవడం లేదు.
అలాగే బోలెడు మంది వైకాపా నుంచి తెలుగుదేశంలోకి జంప్ అన్నారు. వాళ్లందరూ రాజీనామా చేసి, ఎన్నికలు ఎదుర్కోవాలన్న డిమాండ్ అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. కానీ బాబు ఈ విషయంలో అస్సలు పెదవి విప్పడం లేదు. పోనీ మాంచి బలమైన జంప్ జిలానీని చూసి రాజీనామా చేయించి గెలిపిస్తే, ఇక మరెవ్వరు మాట్లాడరు కదా? కానీ బాబు ఆ ధైర్యం చేయడం లేదు. అంతెందుకు విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు వున్నాయి. వాటికి పైలెట్ ప్రాజెక్టుగా వుంటుంది. దగ్గరల్లోని బొబ్బిలి ఎమ్మెల్యేను రాజీనామా చేయించి, ఎన్నికలు జరిపించవచ్చు కదా?
పైగా ఇప్పుడు ఇది మంచి తరుణం కూడా. ఎందుకంటే, రాష్ట్రంలో బాబుకు అత్యంత అనుకూల వాతావరణం వుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. బాబు అనుకూల దినపత్రికలు అన్నీ ఇదే విషయాన్ని బ్యానర్లై చాటుతున్నాయి. ఏకంగా 87 శాతానికి పైగా బాబు పాలన బాగుందంటున్నారు. 80 శాతం మంది ఉచిత ఇసుక స్కీమ్ సూపర్ అంటున్నారు. 73 శాతం చందన్న భీమా అదుర్స్ అంటున్నారు. 81శాతం మంది ఎన్టీఆర్ వైద్యసేవ అద్భుతం అంటున్నారు. 47శాతం మంది ఈ పాస్ సూపరెహె అంటున్నారు. ఇంతకన్నా అద్భుత తరుణం ఇంకోటి వుంటుందా? వంద ఓట్లకు 87 ఓట్లు బాబు పార్టీకే వచ్చే అవకాశం.
అందుకే బాబు ఇప్పుడు అర్జెంట్ గా కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లిపోవచ్చు..ఈ ఎన్నికల్లో కనుక వైకాపాను ఓడించేయగలిగితే, ఇక జగన్ ను కొన్నాళ్లు ఇంటికే పరిమితం చేయవచ్చు. సర్వేశ్వరులు ఇంతలా బాబు సూపర్, బాబు పాలన గోల్డ్, బాబు పథకాలు సూపరో సూపరు అంటూ ఘోషిస్తున్న ఈ తరుణం కన్నా మించినది ఏముంటుంది? ఎన్నికలకు వెళ్లడానికి?