రోజా ఫైర్‌.. టీడీపీ - బీజేపీ నల్లదొంగలు.?

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, తన నియోజకవర్గంలోని ఓ బ్యాంకుకు వెళ్ళారు. అక్కడ కరెన్సీ మార్పిడి కోసం ప్రజలు పడ్తున్న పాట్లు స్వయానా అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ప్రజా ప్రతినిథీ ప్రజల కష్టాల గురించి తెలుసుకోకపోవడం శోచనీయమే మరి.! 

ఢిల్లీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఓ బ్యాంకు ముందు క్యూ లైన్‌లో నిల్చుని, నోట్ల మార్పిడి కోసం ప్రయత్నించారు. అఫ్‌కోర్స్‌.. దాన్ని అధికార బీజేపీ, పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టి పారేసిందనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడు రోజా విషయమ్మీద కూడా రేపు టీడీపీ నేతలు, బీజేపీ నేతలు 'పబ్లిసిటీ ఆరోపణలు' చేయడం సహజమే. అయితే, తమను గద్దెనెక్కించిన ఓటర్ల పాట్లు గురించి, ఏ ప్రజా ప్రతినిథీ ఆలోచించకపోతే ఎలా.? ఇప్పుడిదే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 

మెజార్టీ రాజకీయ నాయకులు కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారంపై సైలెంట్‌గా వుండిపోయారు. వీరిలో చాలామందికి కొద్ది రోజుల ముందే నోట్ల మార్పిడిపై సంకేతాలు వెళ్ళాయనీ, దాంతో వారంతా జాగ్రత్తపడిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ.. ఇలా చాలా పార్టీలు ఈ ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ తదితర ముఖ్యమంత్రులు చేస్తున్న ఈ ఆరోపణల్ని లైట్‌ తీసుకోవడానికి వీల్లేదు. 

రాజకీయ నాయకులు ఎంతగా ముందస్తు జాగ్రత్త పడి వుండకపోతే, ఇప్పుడు ప్రజల పాట్లు గురించి ఎవరూ ఎందుకు స్పందించడంలేదట.? మామూలుగా అయితే చిన్న చిన్న విషయాలకే రోడ్డెక్కి నానా యాగీ చేసే రాజకీయ నాయకులు సైలెంటయిపోవడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. 

ఇక, రోజా, బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించి ఉపయోగం లేదు. 'మా బ్యాంకులో సరిపడా క్యాష్‌ లేదు.. మేమేం చెయ్యలేం.. ఇది మా నిర్ణయం కాదు కదా..' అంటూ బ్యాంకు సిబ్బంది సమాధానమిచ్చారు. ఇంతకు భిన్నంగా బ్యాంక్‌ నుంచి ఏ ప్రజా ప్రతినిథికి అయినా సమాధానం రాదనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే, ప్రజల ఇబ్బందుల్ని తగ్గించే దిశగా అయినా రాజకీయ పార్టీలు ప్రజలకు అండగా వుండాలి కదా. అప్పుడే కదా, పాలకులు ఎట్‌లీస్ట్‌ ప్రత్యామ్నాయం గురించి అయినా ఆలోచించేది. 

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ వ్యవహారంపై మొదటిసారిగా గట్టిగా మాట్లాడిన రోజా, టీడీపీ - బీజేపీ నేతల్ని ఉద్దేశించి 'గొంగలు' అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. 'నల్లదొంగలు ముందే జాగ్రత్తపడ్డారు..' అంటూ రోజా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయిప్పుడు. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.. రోజా వ్యాఖ్యలతో భుజాలు తడుముకునే ఆ గుమ్మడికాయ దొంగలెవరో.!

Show comments