అబ్జర్వేషన్‌: చట్టసభలెందుకు.?

ఒకరోజంతా కిందా మీదా పడ్డారు.. చివరికి ఏదో తేల్చారు. నోటికొచ్చిందేదో చెప్పారు. ఏం చెప్పారో, ఎవరికీ అర్థం కాలేదు. పోలవరం ప్రాజెక్టుకి 100 శాతం నిధులు.. అన్న ఒక్క మాటే అర్థమయ్యింది. ప్రత్యేక ప్యాకేజీతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌కి అందాల్సినవన్నీ అందుతాయి, హోదా అన్న పేరు తప్ప.. అని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పిన మాట వాస్తవం. 

ప్రెస్‌ మీట్‌ పెట్టి ఈ వివరాల్ని చెప్పిన అరుణ్‌ జైట్లీ, ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఎందుకు ఆ మాట చెప్పలేకపోయారు.? ఇదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ఎక్కడ చెప్పారన్నది కాదు, చెప్పింది పాటిస్తారా.? లేదా.? అన్నదే అసలు ప్రశ్న. నిజమే మరి, రాజ్యసభలో ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ప్రకటించారు. ఏం లాభం.? ఆ ప్రకటన చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. 

చట్ట సభలకు రాజకీయ ప్రముఖులు ఇస్తున్న ప్రాధాన్యత ఇది. అలాంటప్పుడు, కోట్లు వెచ్చించి చట్ట సభల్ని నిర్వహించడం ఎందుకు.? ఈ ప్రశ్న సహజంగానే, సగటు భారతీయుడిలో కలుగుతుంది. తప్పదు మరి, కొన్ని అంశాలకు చట్టబద్ధత కల్పించాలంటే, వేరే మార్గం లేదు.. చట్ట సభల సాక్షిగానే జరగాలది. అద్గదీ అసలు విషయం. అక్కడ తలుపులు మూసెయ్యొచ్చు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసెయ్యొచ్చు.. కానీ 'చట్టబద్ధత' పేరుతో మహా నాటకానికి తెరలేపాలంటే ఓ వేదిక కావాలి. అదే చట్ట సభ. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభలో ఉదయం నుంచీ రచ్చ రచ్చ జరుగుతోంది ప్రత్యేక హోదా కోసం. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఏదో ప్రకటన చేస్తారు. ప్రతిపక్షం గనుక, నిలదీస్తుంది, గందరగోళం సృష్టిస్తుంది. సభ వాయిదా పడుతుంది. ఇంతకన్నా గొప్పగా ఏమన్నా అసెంబ్లీలో జరుగుతుందా.? చాన్సే లేదు. కానీ, జీఎస్‌టీ బిల్లు మాత్రం ఆమోదం పొందుతుంది. 

రెండుసార్లు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసినా, దానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రే కట్టుబడి వుండరు. అదేమీ సంజీవని కాదంటారు. అలాగైతే, తీర్మానం ఎందుకు చేసినట్లు.? చట్ట సభల సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీకి, చట్ట సభల సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన తీర్మానానికీ విలువ లేకపోతే, చట్ట సభల నిర్వహణే వృధా. ఇందులో ఇంకో మాటకు ఆస్కారమే లేదు. 

సమాజంలో అన్ని వ్యవస్థల్నీ నిర్వీర్యం చేసినట్లే.. చట్ట సభల్ని కూడా పాలకులు నిర్వీర్యం చేసేస్తున్నారు. ప్రతిసారీ ప్రజాస్వామ్యం పరిస్థితి ఒకటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడటం. ఎవరు అధికారంలోకి వచ్చినా ఇదే తంతు.

Show comments