భావన కిడ్నాప్‌ కేసు.. అటకెక్కినట్టే.!

వారం రోజుల తర్వాత ప్రధాన నిందితుడు దొరికాడు.. అసలు దొరికాడా.? లేదంటే, లొంగిపోయేందుకు ప్రయత్నించాడా.? అన్నదానిపైనా క్లారిటీ లేదు. వారం రోజులపాటు అతనికి ఎవరో 'ఆశ్రయం' ఇచ్చారన్నది నిర్వివాదాంశం. అతనెవరన్నది మాత్రం ఇంతవరకూ తెలియలేదు. 

హీరోయిన్‌ భావన కిడ్నాప్‌, లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి సస్పెన్స్‌ కొనసాగుతోంది. రెండున్నర గంటలపాటు తనను కిడ్నాప్‌ చేసి, అసభ్యకరమైన రీతిలో తనను ఫొటోలు తీసి, వీడియోలు చిత్రీకరించి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ భావన పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకూ 'ఫొటో, వీడియో'కి సంబంధించిన ఆధారాలు పోలీసులకు చిక్కకపోవడం గమనార్హం. ప్రధాన నిందితుడు దొరికినా, అతన్నుంచి ఫోన్‌ లేదా కెమెరా స్వాధీనం చేసుకున్న దాఖలాల్లేవు. అసలు, అతని వద్ద అలాంటివేమీ లేవని పోలీసుల నుంచి వస్తోన్న సమాచారంతో అంతా షాక్‌కి గురవుతున్నారు. 

నిజానికి హీరోయిన్‌ భావన కిడ్నాప్‌ వ్యవహారంలో ప్రధాన సాక్ష్యాలు ఆ వీడియోలు, ఫొటోలు మాత్రమే. అవే లేనప్పుడు, నిందితులు చాలా తేలిగ్గా తప్పించుకోవడానికి అవకాశముంది. లైంగిక దాడి (అత్యాచారం) జరగలేదని భావన సన్నిహితులు చెబుతున్న దరిమిలా, ఆ వీడియోలు, ఫొటోలు వెలుగు చూస్తేనే ఈ కేసు నిలబడ్తుంది.. లేదంటే అంతే సంగతులు. 

వ్యూహాత్మకంగానే ప్రధాన నిందితుడు కొన్నాళ్ళపాటు అజ్ఞాతంలో గడిపాడనీ, ఈ సమయంలోనే వ్యవహారమంతా చక్కబెట్టేశాడనీ తెలుస్తోంది. ఇదెంతవరకు నిజం.. అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. 'రికవరీ' విషయమై పోలీసుల నుంచి మీడియాకి అందున్న సమాచారం చూస్తోంటే కేసు అటకెక్కినట్లే కన్పిస్తోంది. భావన మాత్రం, దోషులకు శిక్ష పడేదాకా తాను కెమెరా ముందుకు వచ్చేది లేదంటోంది. అరెస్టులంటే జరుగుతాయిగానీ, శిక్షలు పడాలంటే అంత తేలికా.? ఎందుకంటే, ఇది మన ఘన భారతం కదా.!

Show comments