'గద్దలు' తన్నుకుపోనాయ్‌.!

భూమిని గద్దలు తన్నుకుపోయాయ్‌.! ఎకరం కాదు, రెండెకరాలు కాదు.. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని 'గద్దలు' తన్నుకుపోయినట్లు తెలంగాణ ప్రభుత్వం తీరిగ్గా గుర్తించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగారు. సీఐడీ విచారణకు ఆదేశించారు. ఇంకోపక్క, ఈ కేసులో ఇప్పటికే పలు అరెస్టులు కూడా జరిగాయి. గజం భూమి కొనుగోలు జరిగితేనే, దానికి నానా తంటాలూ పడి, రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి వస్తుంది. కానీ, ఎకరాల కొద్దీ భూముల్ని కొట్టేయడం చాలా చాలా తేలిక. అదే మరి, 'గద్దలెత్తుకెళ్లడం' అంటే.! 

ఇక్కడ, గద్దలంటే నిజంగానే గద్దలనుకునేరు.. ఈ గద్దలు వేరు. ఈ గద్దల కేటగిరీలోకి చాలా విభాగాలొస్తాయి. అధికార గణం కావొచ్చు, రాజకీయ నాయకులు కావొచ్చు, అందులో పోలీసులు కూడా వుండొచ్చు. ఇంతమంది సహకారం లేకుండా వెయ్యి ఎకరాల భూమిని కొట్టేయడం అంత తేలిక కాదు కదా. 

చిత్రమైన విషయమేంటంటే, తెలంగాణలో పది వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణం వెలుగు చూసిన వెంటనే, విశాఖలో ఐదు వేల ఎకరాల భూ కుంభకోణం వెలుగు చూసింది. హుద్‌ హుద్‌ తుపాను వచ్చి రికార్డులు గల్లంతయ్యాయన్న సాకుతో, ఐదు వేల ఎకరాల భూముల్ని కొల్లగొట్టేశాయి రాజకీయ గద్దలు. సాక్షాత్తూ ఓ మంత్రిగారే, విశాఖలో భూ కుంభకోణాలు ఎక్కువైపోయాయనీ, భూ కుంభకోణాలకు రాజకీయ నాయకులే కేంద్ర బిందువులనీ సెలవిచ్చారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఒకేసారి భూ కుంభకోణాల పేరుతో ఎందుకు వార్తల్లోకెక్కాయట.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ అప్రమత్తమవుతోంది. కానీ, 'గద్దల' ఆచూకీ తెలుస్తుందా.? ఇందులోంచి, రాజకీయ గద్దలు ఎగిరిపోతాయా.? ఏమో మరి, కాలమే సమాధానం చెప్పాలీ ప్రశ్నకి. 

Show comments