వర్మ 'అది' మానేశాడట.. నమ్మొచ్చా.?

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ 'వోడ్కా' మానేశాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. అంతే కాదండోయ్‌, పవన్‌కళ్యాణ్‌ అభిమానులకి క్షమాపణ కూడా చెప్పేశాడు. ఈ రోజు ఏప్రిల్‌ 1 కాదు కదా.! మరెందుకు వర్మ, ఇంత 'తీక్షణమైన', ఎవరూ నమ్మలేని వ్యాఖ్యలు చేశాడట.? ఏమో మరి, ఆయనకే తెలియాలి. 

అయినా, మాట మీద నిలబడని రామ్‌గోపాల్‌ వర్మ చెప్పే మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరమేమీ లేదని సోషల్‌ మీడియాలోనే వర్మ కామెంట్లకు 'కౌంటర్‌' ఇస్తున్నారు. ఇందులో పవన్‌కళ్యాణ్‌ అభిమానులే ఎక్కువ. 'వోడ్కా మానేశానంటున్నావ్‌.. చేతిలో వోడ్కా గ్లాస్‌ వుంది కదా.!' అంటూ సెటైర్లు దంచేస్తున్నారు నెటిజన్లు. అంతే మరి, వర్మకీ వోడ్కాకీ వున్న అనుబంధం అలాంటిది. 

బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌కీ, విద్యుత్‌ జమ్వాల్‌కీ మధ్య 'రియల్‌ ఫైట్‌'ని ఆశిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు దంచేసిన వర్మ, విద్యుత్‌ జమ్వాల్‌, టైగర్‌ ష్రాఫ్‌ చేతిలో ఓడిపోతాడంటూ జోస్యం చెప్పిన విషయం విదితమే. ఇలాంటి 'కెలుకుడంటే' వర్మకి చాలా ఇష్టం. చెయ్యాల్సిన రచ్చ అంతా చేసేసి, 'సరదాకి' అనడం కూడా ఆయనకే చెల్లింది మరి. బ్రూస్‌లీ చెప్పిన ఓ కోట్‌ని ప్రస్తావిస్తూ, తనను తాను బ్రూస్‌లీతో పోల్చేసుకుంటూ.. వర్మ క్షమాపణలు చెప్పేయడం గమనార్హమిక్కడ. 

వర్మ ఏం చేసినా సంచలనమే. అందుకే ఆయన సంచలనాల రామ్‌గోపాల్‌ వర్మ అయ్యాడు.

Show comments