ట్రంప్‌ మూర్ఖుడా.? పిరికివాడా.?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పిరికివాడైతే కాదు.. మూర్ఖుడు అన్న విమర్శని ఆయన ఎప్పటినుంచో ఎదుర్కొంటూనే వున్నాడు. 'ఇస్లామిక్‌ అతివాదానికి చెక్‌ పెట్టేందుకు' అంటూ, ఏడు దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధిస్తూ, నిన్న డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ప్రపంచమంతా షాక్‌కి గురైంది. ఇప్పుడు ఏడు దేశాలే, ముందు ముందు ఈ లెక్క ఎంతకు పెరుగుతుంది.? అన్న విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోందిప్పుడు. 

అసలంటూ ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని పెంచి పోషించిందెవరు.? అంటే, సింపుల్‌గా ఈ ప్రశ్నకి సమాధానం అమెరికా అని చెప్పొచ్చు. తన ఆయుధ వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో అమెరికా, ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ అతివాదానికి ఊపిరిలూదింది. కొన్ని దేశాల్లోని అంతర్గత వివాదాల్లో తలదూర్చింది. ఆయా దేశాల్ని సర్వనాశనం చేసింది.  ఒసామా బిన్‌ లాడెన్‌ లాంటి తీవ్రవాదుల్ని పెంచి పోషించింది. పాకిస్తాన్‌కి అమెరికా అండదండలు అందించింది కూడా ఈ క్రమంలోనే. తద్వారా పాకిస్తాన్‌కి ఆయుధ సంపత్తిని సమకూర్చితే, ఆ తర్వాత భారత్‌ కూడా తన ఆయుధ సంపత్తిని పెంచుకోడానికి అమెరికాపై ఆధారపడుతుందన్నది 'పెద్దన్న' ఆలోచన. పెద్దన్న అంటే, తగువు తీర్చాలిగానీ పెంచకూడదు. ఇక్కడ పెద్దన్న అమెరికా ఆలోచనలు వేరు. 

తాను పెంచి పోషించిన లాడెన్‌, తన మీదనే దాడి చేయడంతో అమెరికా విలవిల్లాడిపోయింది. ఎలాగైతేనేం, లాడెన్‌ని అమెరికా అంతమొందించింది. అల్‌ఖైదా అమెరికా మీద దాడి చేసిన తర్వాత, అమెరికా వ్యతిరేకి ముస్లిం సమాజం.. అనే స్థాయిలో ప్రొజెక్షన్‌ జరిగింది. ముస్లిం పేరు చెబితే అమెరికా వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయనుకునేంతలోపే పిడుగు లాంటి నిర్ణయం తీసుకున్నారు ట్రంప్‌. 

ముస్లిం సమాజంపై ఉక్కుపాదం మోపడం.. అనే సంకేతాల్ని ట్రంప్‌ నిర్ణయం పంపడంతో ఒక్కసారిగా ప్రపంచం షాక్‌కి గురయ్యింది. ఇప్పుడు ముస్లిం సమాజం, అమెరికా మీద తిరగబడాలి. అయితే, ఏడు దేశాల నుంచి ముప్పు పొంచి వున్న దరిమిలా.. ఆ దేశాలపైనే తాత్కాలిక నిషేధం.. అన్నది ట్రంప్‌ మద్దతుదారుల వాదన. ఆల్రెడీ ఐసిస్‌ పేరుతో ఇస్లామిక్‌ అతివాదం ప్రపంచానికి సవాల్‌ విసురుతోంది. ఇప్పుడు ట్రంప్‌ నిర్ణయంతో ఐసిస్‌కి మరింత బలం చేకూరుతుందన్నది నిర్వివాదాంశం. 

ట్రంప్‌ తీరు, అమెరికన్లని పిరికివారిగా చూపిస్తోందనీ.. ట్రంప్‌ మూర్ఖపు నిర్ణయాల్ని భరించలేమని అమెరికాలో ట్రంప్‌ వ్యతిరేకులు వాపోతున్నారు. ట్రంప్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్ని ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకోపక్క, ట్రంప్‌ పిరికివాడని, ముస్లిం సమాజాన్ని చూసి భయపడ్తున్నాడనీ ఇస్లామిక్‌ అతివాదులంటారు. ఏ ఉద్దేశ్యంతో ట్రంప్‌, ఇస్లామిక్‌ అతివాదంపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నా.. ఇది అమెరికా మీదనే కాకుండా, మొత్తం ప్రపంచమ్మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

Show comments