వెంకయ్యా.. ఏం బొంకారయ్యా.!

ఖచ్చితంగా వెంకయ్యనాయుడుగారికి ఆస్కార్‌ అవార్డ్‌ ఇచ్చెయ్యాల్సిందే. తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించేసి వెంకయ్య రాజ్యసభలో బొంకేశారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా వెంకయ్య బొంకేసిన వైనం గురించి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చించుకోవాలేమో.! 

పొద్దున్న లేస్తే చాలు.. రాజకీయాల్లో నైతిక విలువల గురించి 'నిప్పు' నారా చంద్రబాబునాయుడికంటే గట్టిగా చెబుతుంటారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు. మాట ఇస్తే వెనక్కి తగ్గరట. ఆయన నోట్లోంచి మాట వచ్చిందంటే, అది ఖచ్చితంగా జరిగే మాటే అవుతుందట. ఏదీ, ప్రత్యేక హోదాపై మీరు ఇచ్చిన మాట.? అనడిగితే మాత్రం, వెంకయ్యనాయుడు బొంకేస్తారట. వయసు పెరిగితే సరిపోదు.. దాన్ని అనుభవం అనలేం.. అనుభవం అంటే, ఆ అనుభవం సమాజానికి ఉపయోగపడేలా వుండాలి.. అని ఓ సందర్భంలో ఇదే వెంకయ్యగారు చెప్పారు. మరిప్పుడు, వెంకయ్య ఏమంటారు, తన అనుభవం గురించి.! 

రాజ్యసభలో 2014 ఫిబ్రవరిలో వెంకయ్యనాయుడే, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అడిగారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామంటే, వెంకయ్య పదేళ్ళు అడిగారు. అంతేనా, మీరు పదేళ్ళు ఇవ్వకుండా ఐదేళ్ళే ఇస్తే, ఆ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమే కాబట్టి, పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని సెలవిచ్చారు. ఇప్పుడేమో, ప్రత్యేక హోదా అనేది బిల్లులో లేని అంశమనీ, ఆ కారణంగా ఇతర రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తున్నాయని బుకాయిస్తున్నారు వెంకయ్యనాయుడు. 

ఈ రోజు రాజ్యసభలో చర్చ జరిగిన సమయంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిథులు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒరిస్సా, తమిళనాడు.. ఇలా ఒకటేమిటి, దాదాపు అన్ని రాష్ట్రాల మద్దతూ ఆంధ్రప్రదేశ్‌కి లభించింది. అదే సమయంలో, 'ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వడం, మా డిమాండ్లను పరిగణనలోకి తీసుకోండి..' అని ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదన వచ్చింది. 'మా డిమాండ్లను పరిగణనలోకి తీసుకోండి' అన్న మాటని, ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వొద్దన్నట్లుగా అన్వయించడం వెంకయ్య రాజకీయ చాణక్యానికి నిదర్శనమనుకోవాలా.? 

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ప్రసంగించినా, ఓ పెద్ద లిస్టు తీసుకొచ్చి చదివేసే వెంకయ్య రాజ్యసభలోనూ అదే పని చేశారు. భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకయ్య, ప్రధాని పదవిలో వున్న తమ పార్టీకి చెందిన నరేంద్రమోడీని ఒప్పించి, జన్మభూమి రుణం తీర్చుకోలేకపోవడాన్ని ఏమనుకోవాలి.? రాజకీయం అంటే బొంకేయడమేనా.? జీ హుజూర్‌.. అంటూ తన అనుభవాన్ని నరేంద్రమోడీ పాదాల వద్ద తాకట్టు పెట్టేయడమా.? వాట్‌ ఏ షేమ్‌.!

Show comments