ప్రత్యేక హోదాపై 'పచ్చ' రాతలు

ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఏమాత్రం కన్పించినా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఊరుకుంటారా.? బీజేపీ శ్రేణులు సైలెంటుగా వుంటాయా.? అక్కడదాకా ఎందుకు, తెలుగుదేశం పార్టీ సంబరాలు మొదలెట్టేయకుండా వుంటుందా.? ఛాన్సే లేదు. కానీ, 'పచ్చ రాతల్లో' మాత్రం ప్రత్యేక హోదా కన్పించేస్తోంది. 

ఓటుకు నోటు కేసు తెరపైకి రాగానే, 'పచ్చ మీడియాలో' ప్రత్యేక 'పచ్చ' రాతలు షురూ అయ్యాయి. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, కేంద్రానికి ముసాయిదా ఇచ్చారట ప్రత్యేక హోదాకి సంబంధించి. ఇది ఇంకా పెద్ద కామెడీ. అయితే, దీనికి పచ్చ మీడియాలో జరిగిన ప్రచారమేంటో తెలుసా.? కేంద్రం, ప్రత్యేక హోదాపై కేంద్రం ముసాయిదా తయారు చేసిందని. కేంద్రంలో సుజనా చౌదరి భాగమేగానీ, ముసాయిదాలు తయారుచేసేంత సీన్‌ అయితే ఆయనకు లేదు. అసలాయన మాటకి ఏమాత్రం విలువ లేదక్కడ. 

ఓ పక్క, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పీకల్లోతు ఇరుక్కుపోయే పరిస్థితులు కన్పిస్తోంటే, దాన్ని కవర్‌ చేసేందుకు పచ్చ మీడియా పడ్తున్న పాట్లు చూస్తే నవ్వు రాకుండా వుండదు. కేంద్ర మంత్రులు వెంకయ్య, అరుణ్‌ జైట్లీ సమావేశమైనంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌ గురించే చర్చ జరుగుతోందని ఎలా అనుకోగలం.? అసలు ప్రత్యేక హోదాపై చర్చ జరగడానికి ఏమీ లేదు. ఇవ్వాలనుకుంటే ప్రధాని నరేంద్రమోడీ ద్వారానే ఈ ప్రకటన వచ్చేస్తుంది. 

కామెడీ ఏంటంటే, సెప్టెంబర్‌ 2న కేంద్రం, ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తుందట. ఆ ప్రకటన ఏంటట.? అంటే, 'ఇస్తారో ఇవ్వరో తేల్చుతారు.. ఇవ్వని పక్షంలో ప్రత్యేక హోదా పేరు కాకుండా దాని ద్వారా వచ్చే అన్ని వెసులుబాట్లతో కూడిన ప్రకటన చేస్తారు.. అందులో ఏమేమి, ఎలా ఇస్తారో చెబుతారు..' అని. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.. అన్న చందాన లేదూ ఈ 'పచ్చ' రాతల ప్రసహనం.?

Show comments