రహస్య రాజకీయ విరాళం

రాజకీయ పార్టీలకు 20 వేల రూపాయల లోపు విరాళమిస్తే, దానికి సంబంధించిన లెక్కల్ని, వివరాల్ని చూపించాల్సిన పనిలేదు. ఇది పాత మాట. కొత్త మాట ఏంటంటే, ఆ 20 వేల రూపాయల మొత్తాన్ని 2 వేల రూపాయలకు తగ్గించాలన్న డిమాండ్‌ తెరపైకి రావడం, తద్వారా రాజకీయ పార్టీల అవినీతిని అంతమొందించొచ్చన్న వాదన ప్రముఖంగా విన్పిస్తోంది. 

అసలు రాజకీయమేంటి.? విరాళమేంటి.? రాజకీయ పార్టీలకు విరాళాలు ఎందుకు అవసరం.? ఆ విరాళాలకు లెక్కలెందుకు చూపించాల్సిన అవసరం లేదు.? రాజకీయం అంతే. అదో మిస్టరీ. ఆ రాజకీయం చుట్టూ ఏదైనా జరగొచ్చు. ఆ రాజకీయం బురదలోనే కూరుకుపోయి వుండొచ్చు. కానీ, ఆ రాజకీయమే వ్యవస్థను శాసిస్తుంటుంది. ఏం చేస్తాం, ఇది ప్రజాస్వామ్యం. రాజకీయం అంటే బురద.. అని తెలిసినాసరే, ఆ రాజకీయానికి వ్యవస్థ సలాం కొట్టి తీరాల్సిందే. 

దేశంలో భారతీయ జనతా పార్టీ, తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ.. ఇవి రెండూ 'రికార్డు స్థాయిలో సభ్యత్వమున్న పార్టీలు' అని చెప్పుకుంటుంటాయి. 'సభ్యత్వం' విషయంలో ఈ రెండు పార్టీలు చేసినంత హడావిడి బహుశా ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ చెయ్యదేమో.! సభ్యత్వం పొందినోళ్ళంతా విరాళాలు ఇవ్వాలని రూలేమీ లేదు. కానీ, సభ్యత్వ రుసుము అనేది నామమాత్రంగా వుండడం మూమూలే. దాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదనుకోండి.. అది వేరే విషయం. 

20 వేల రూపాయల నుంచి 2 వేల రూపాయలకు 'లెక్క చూపనవసరం లేని లిమిట్‌'ని తగ్గించానసరే, సభ్యత్వాలు ఎలాగూ లక్షల్లో వుంటాయి గనుక, ఆ సభ్యత్వ రుసుము పెంచేస్తే సరిపోతుంది. లేదంటే, ఆ సభ్యులతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విరాళాలు తెప్పించేస్తే.. కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు రాజకీయ పార్టీలకు విరాళాలుగా పోగైపోతాయ్‌. ఇది జగమెరిగిన సత్యం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. తిరుపతి వెంకన్నకి (ఏ దేవుడికైనాసరే) విరాళమిస్తే, దానికి లెక్క చెప్పక్కర్లేదు. అది భక్తి. రాజకీయ పార్టీల్ని కూడా అలా 'దైవం'తో పోల్చేద్దామా.? సిగ్గు సిగ్గు.! 

అయినా, రాజకీయ పార్టీలకు డబ్బులెందుకు.? ఈ ప్రశ్నకు సమాధానం సింపుల్‌. నేతల్ని కొనుగోలు చేయాలి. ప్రజల్ని వంచించాలి, ఓటు కోసం నోట్లు వెదజల్లాలి. నిజమేనండోయ్‌, అంతగా రాజకీయ పార్టీలు కష్టపడాలంటే ఖర్చులుండాలి. ప్రజల్ని ఉద్ధరించేయడానికే కదా, రాజకీయ పార్టీల ఖాతాల్లో డబ్బుల్లేకపోతే ఎలా.? ఏ మొహం పెట్టుకుని చెబుతారు, నేతల్ని కొనుగోలు చేశామని.! అందుకే, లెక్కలు చెప్పరుగాక చెప్పరు. ఎన్నికలంటే ఓట్ల పండగ కాదు.. నోట్ల పండగ, ప్రలోభాల పండగ. 

ఏదిఏమైనా, రాజకీయమంటేనే ఓ జడ పదార్థం. అదెవరికీ అర్థం కాదు. రాజకీయ విరాళాలు కూడా అంతే. ఎనీ డౌట్స్‌.?

కొసమెరుపు: నల్ల కుబేరులకు ఒకటే పొలిటికల్ ఎజెం ా వుంటుంది. అధికార పార్టీకి కాస్త ఎక్కువ విరాళమిస్తారు.. అలాగే, దాదాపు అన్ని రాజకీయ పార్టీలకూ విరాళాలు తప్పనిసరి. మరి, వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తరిమికొట్టడం సాధ్యమేనా.?

Show comments