చంద్రబాబుకిది రాజకీయ సమాధే

వెన్నుపోటు రాజకీయాల్లో ఆరితేరిన టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కేంద్రాన్ని నమ్మి, చంద్రబాబు 'పచ్చ' మీడియాకి లీకులిచ్చారు. ఏడు పేజీల ప్రకటన.. లక్షన్నర కోట్ల ప్యాకేజీ.. రైల్వే జోన్‌.. ఇంకేవేవో అంటూ 'పచ్చ' మీడియాలో దర్శనమిచ్చిన రాతలు అన్నీ ఇన్నీ కావు. 

'ప్రత్యేక హోదా తరహాలో ప్యాకేజీ వస్తే.. ఎలా కాదనగలం.? ముందు వచ్చింది తీసుకుని, ఆ తర్వాత రావాల్సినదాని గురించి డిమాండ్‌ చేద్దాం..' ఇదీ క్యాబినెట్‌ మీటింగ్‌లోనూ చంద్రబాబు క్యాబినెట్‌ సహచరులకు చెప్పిన మాట. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలకూ ఇదే మాట చెప్పారు. కానీ ఏం జరిగింది.? నమ్మినందుకు, కేంద్రం చంద్రబాబుని నట్టేట్లో ముంచేసింది. రాజకీయంగా సమాధి కట్టేసింది. 

ఇప్పుడు చంద్రబాబు ముందున్నది ఒక్కటే ఒక్క ఆప్షన్‌. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడం. ఇంకా నిస్సిగ్గుగా కేంద్రాన్ని చంద్రబాబు అండ్‌ కో సమర్థించాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆల్రెడీ కాంగ్రెస్‌కి రాజకీయంగా సమాధి కట్టేశారు అక్కడి ప్రజలు. ఇప్పుడు వంతు బీజేపీదా.? టీడీపీదా.? రెండిటిదా.? అన్నదే ప్రశ్న. 

తెల్లారితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీలో ప్రతిపక్షం నిలదీస్తుంది.. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు షురూ అవుతాయి. ఈ పరిస్థితిని చంద్రబాబు ఇంతకుముందెన్నడూ ఊహించి వుండరు. అసలు కేంద్రం తనకు చెప్పిందేంటి.? చేస్తున్నదేంటి.? ఏమీ అర్థంకాని దయనీయ స్థితిలోకి నెట్టివేయబడ్డారు చంద్రబాబు. లేదంటే, ఎంచక్కా సాయంత్రమే హైద్రాబాద్‌ చేరుకునేవారు. విజయవాడలోనే రాత్రి 11 గంటల వరకూ వుండిపోయిన చంద్రబాబు, కేంద్రం నుంచి వచ్చే ప్రకటన తర్వాత స్పందించాలనుకున్నారు. ఆయన స్పందించడానికే కేంద్రం ఆస్కారమివ్వలేదు. 

ఒక్కటంటే ఒక్క మాట కూడా కొత్తది కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ నోట రాకపోవడం యావత్‌ ఆంధ్రప్రదేశ్‌నే కాదు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా తీవ్రంగా కలచివేసిందట. నిజమేనా.? నమ్మొచ్చా.?

Show comments