రజనీకాంత్‌కి అన్నీ కలిసొచ్చేస్తున్నాయ్‌

శూన్యత వుందిగానీ, ఆ శూన్యతను భర్తీ చేసేందుకే ఎవరికీ పరిస్థితులు అనుకూలించడంలేదు. తమిళనాడు రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన సందర్భమిది. జయలలిత మరణం తర్వాత, తమిళనాడు రాజకీయాలు అత్యంత అధ్వాన్నంగా తయారయ్యాయి. ముఖ్యమంత్రి అయిపోదామనుకున్న శశికళ ఇప్పుడు జైలుకి పరిమితమైపోయారు.

జయలలిత నమ్మిన బంటు పన్నీర్‌సెల్వం, శశికళ కోసం ముఖ్యమంత్రి పదవి వదులుకుని, ఆ తర్వాత ఆ పదవి కావాలనుకుని.. ఎటూకాకుండా పోయారిప్పుడు. అనూహ్యంగా పళనిస్వామి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు.. అదీ శశికళ దయతో. కానీ, శశికళ వర్గానికి అన్నాడీఎంకే పార్టీలో చోటు లేదని పళనిస్వామి చెబుతుండడం గమనార్హమిక్కడ. 

ఇంతటి గందరగోళ పరిస్థితుల్లో తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, మామూలుగా అయితే తమిళనాడులో రాజకీయంగా చక్రం తిప్పెయ్యాలి. రాజకీయ ఆలోచనలు లేకపోతే వేరే సంగతి. రాజకీయాలపై ఆసక్తి, పైగా పదవి మీద వ్యామోహం.. ఇలా అన్నీ వున్నాయి రజనీకాంత్‌కి.

అయినా, ఆయన సాహసించలేకపోతున్నాడాయె. 'స్థానికేతరుడు' అన్న విమర్శ, రజనీకాంత్‌ని ఓ అడుగు వెనక్కి వేసేలా చేస్తోంది. అదే సమయంలో, అవకాశాలు ఊరిస్తున్నాయి. తాజాగా అన్నాడీఎంకే పార్టీలో చీలిక రజనీకాంత్‌కి కలిసొచ్చే అంశమే. 

శశికళ బంధువు దినకరన్‌ వైపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వెళుతుండడంతో, ఏ క్షణాన అయినా పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోనుందన్న ప్రచారం జరుగుతోంది. పరిస్థితుల్ని జాగ్రత్తగా అంచనా వేస్తున్న రజనీకాంత్‌, పొలిటికల్‌ వాక్యూమ్‌ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహరచన చేయడంలో నిమగ్నమైపోయారట. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన.. రజనీకాంత్‌కి పరిస్థితులు కలిసొస్తున్నా.. స్థానికేతరుడు అంశం పెనుశాపంగా మారిపోయింది. 

మరి, ఈ పరిస్థితుల్లో రజనీకాంత్‌ ప్రస్తుత పొలిటికల్‌ వాక్యూమ్‌ని తనకు అనుకూలంగా మార్చుకోగలరా.? వేచి చూడాల్సిందే.

Show comments