మోదీ ఒంటరి పోరు చేయగలడా?

ఇది చరిత్రాత్మక యాజమాన్య వైఫల్యం అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిప్పులు చెరరిగారు. పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పర్యవసనాలను ఆలోచించకుండా తీసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు. నల్లధనాన్ని అరికట్డడం, అవినీతిని నిర్మూలించడం, ఉగ్రవాదంపై పోరాడడం మొదలైన లక్ష్యాల విషయంలో తనకు అభ్యంతరం లేదు కాని ఈ లక్ష్యాల సాధనకు అవలంభించిన విధానాలే సరైనవి కాదని ఆయన దుయ్యబట్టారు. ఈ చర్య సంఘటిత లూటీకి దారితీస్తుందని ఆయన విమర్శించారు. అసలు ఏ దేశంలోనైనా ప్రజలు తమ డబ్బును తాము ఉపసంహరించుకునేందుకు ఇక్కట్లు పడ్డారా చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. దీర్ఘకాలంలో ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

 గురువారం మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభకు వచ్చి ఆయన సంభాణ విన్నారు. మోదీ, అరుణ్ జైట్లీతో పాటు ప్రతిపక్ష నేతలంతా నిశ్శబ్దంగా ఆయన నిప్పులు చెరుగుతుంటే విన్నారు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ సాధారణవ్యక్తి కాదు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలకు సలహాదారు. రిజర్వుబ్యాంకు చైర్మన్‌గా పనిచేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. అయిదేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా ఉండి దేశాన్ని సంస్కరణల పథంలోకి నడిపించారు. ఆ తర్వాత పదేళ్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాంటి వారు విమర్శిస్తున్నారంటే ఒక అర్థం ఉంటుంది. ఆయన ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదు. ఒక ఆర్థిక వేత్తగా కూడా మాట్లాడారు. 

మన్మోహన్ సింగ్ చెప్పిన అభిప్రాయంతో ఈ దేశంలో చాలా మంది ఏకీభవిస్తున్నారు. ప్రస్తుత రిజర్వు బ్యాంకు చైర్మన్ ఊర్జిత్ పటేల్ మాట్లాడడానికి అందుబాటులో లేరు. మాజీ ఆర్‌బీఐ చైర్మన్‌లు ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. అంతర్జాతీయ, జాతీయ పత్రికలు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి.

మన్మోహన్ సింగ్ అన్నట్లు మోదీ ఉద్దేశాలను ఎవరూ శంకించలేరు. బహుశా అందుకే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పలువురు బాహటంగా విమర్శించలేకపోతున్నారు. మధ్యతరగతి అయితే మోదీ అవినీతిపరులు, నల్లధన బేహారుల భరతం పట్టారని సంతోషిస్తున్నారు. అయితే రోజురోజుకూ సమస్య జటిలం అవుతుండడంతో ప్రభుత్వ నిర్వహణా వైఫల్యాన్ని శంకించక తప్పడం లేదు. మొత్తం వ్యవసాయ మార్కెట్, పారిశ్రామిక మార్కెట్ వినియోగదార్ల మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నదని మోదీకి తెలుస్తున్నది. పార్లమెంట్ సమావేశాల్లో రకరకాల వర్గాలు ప్రధానమంత్రికి, కేంద్రమంత్రులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలు దెబ్బతిన్నాయని తమను కాపాడాలని రైతు సంఘ ప్రతినిధులు ఢిల్లీకి మొరపెట్టుకుంటున్నారు.

Readmore!

ఉపసంహరించుకుంటున్న డబ్బు అయితే తిరిగి ఆరునెలల్లోపు ఏదో ఒక రూపంలో ముద్రిస్తారు కాని దెబ్బతిన్న పరిశ్రమలు, చిన్న, మధ్యతరగతి సంస్థలు, అసంఘటిత వ్యాపారులు తిరిగి యదాస్థితికి రావడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. ఎగుమతి, దిగుమతులపై కూడా దీని ప్రభావం ఉంటుంది.

రాజకీయంగా ఈ నిర్ణయం మొత్తం ప్రతిపక్షాలను ఏకం చేసింది. పార్లమెంట్ కనీసం వారం రోజులుగా సరిగా సాగడం లేదు. రాజకీయ విభేదాలను కూడా ప్రక్కన పెట్టి అన్ని పార్టీల వారు ఏకం అయ్యారు. నిజానికి ఎన్డీఏ లో కూడా లుకలుకలు మొదలయ్యాయి. శివసేన మోదీని తీవ్రంగా విమర్శించింది. చంద్రబాబు కూడా నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం లేదు. వ్యాపార రంగాలు బిజెపికి మద్దతు నిచ్చి తప్పు చేసినట్లు భావిస్తున్నాయి. పూర్తిగా మార్వాడి వ్యాపారుల కాంగ్రెస్ పాలనే నయం అంటున్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ది చెబుతారని వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

నిజానికి ఇదే జరిగితే యుపి ఎన్నికలతర్వాత కేంద్రంలో ప్రభుత్వంలో చిచ్చు రేకెత్తక తప్పదు. మోదీకి మద్దతునిచ్చేవారు కూడా ఆయనను బహిరంగంగా విమర్శిస్తారు. మోదీ వ్యతిరేక ప్రతిపక్ష ఫ్రంట్ బలోపేతమవుతుంది. నోట్ల రద్దు నేపథ్యంలో భారీ కుంభకోణాలు బయటపడి బీజేపీ ఆత్మరక్షణలో పడే పరిస్థితి ఏర్పడక తప్పకని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మోదీ అత్యుత్సాహంతో తానెక్కిన కొమ్మ తానే నరుక్కున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Show comments