నిఖిల్ రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్లా?

తమ సినిమాల మీద హీరోలకు ప్రేమ వుండడం అవసరం. అనివార్యం. కానీ అలా అని ఒకటే టైపు శ్రద్ధ తీసుకుంటే అది రాంగ్ మెసేజ్ కింద వెళ్లే ప్రమాదం వుంది. నిఖిల్ కెరీర్ ను టర్న్ చేసిన దర్శకులు సుధీర్ వర్మ, చందు మొండేటి. అది కాదనలేరు ఎవరూ.

కానీ అలా అని ప్రతి సినిమాలో వారి ప్రమేయం వుండేలా చూసుకుంటే, నిఖిల్ దగ్గరకు రావాలనుకున్న దర్శకులు, కాస్త దూరంగా వుండే ప్రమాదం వుంది. మనం కాస్త మంచి స్క్రిప్ట్ పట్టుకెళ్లినా మళ్లీ అక్కడ ఆ ఇద్దరు డైరక్టర్ల సూపర్ విజన్ తప్పదేమో అన్న అనుమానాలు కొందరు అప్ కమింగ్ డైరక్టర్లు వ్యక్తం చేయడం ఇక్కడ గమనార్హం.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాకు చందు మొండేటి తెరవెనుక వుండి సంభాషణలు అందించారు. ఎందుకంటే చందు మంచి మాటల రచయిత కాబట్టి. కేశవ సినిమాకు సుధీర్ వర్మ డైరక్టర్ గా పని చేసారు. పబ్లిసిటీతో అది హిట్ అనిపించుకున్నారు తప్ప, బయ్యర్లు కొంత నష్టపోయిన మాట వాస్తవం. ఆ సంగతి డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు. ఇప్పుడు మళ్లీ కిర్రాక్ పార్టీకి చందు మాటలు రాస్తున్నారు. స్క్రిప్ట్ సవరణలు చేసారు. సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

అసలు రాజు సుందరం డైరక్టర్ అనుకున్నారు. కానీ ఆయన తప్పుకున్నారు. కారణం ఈ ఇద్దరి ప్రమేయం వుండడమే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు డైరక్టర్ గా చందు అసోసియేట్ అయిన కొత్త కుర్రాడిని తీసుకున్నారు. సో టోటల్ గా ఈ ప్రాజెక్టు మీద చందు, సుధీర్ గ్రిప్ ఫుల్ గా వుంటుదన్నమాట.

ఒక విధంగా ఇది బాగుండొచ్చు కానీ, నిఖిల్ కు కథ చెబుదాం, లేదా నిఖిల్ తో సినిమా చేద్దాం అనుకునే డైరక్టర్లకు మాత్రం డిఫరెంట్ మెసేజ్ వెళ్లే ప్రమాదం వుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Show comments