కేసీఆర్‌ అడుగుజాడల్లోనే చంద్రబాబు.!

రాజకీయాల్లో కేసీఆర్‌ తనకి జూనియర్‌.. అని చెప్పుకుంటుంటారు చంద్రబాబు. ఔను మరి, టీడీపీ అధినేతగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేస్తున్న సమయంలో, కేసీఆర్‌ టీడీపీలో వున్నారు. మంత్రిగా పనిచేశారు. ఆ లెక్కన కేసీఆర్‌, చంద్రబాబుకి జూనియర్‌ కావొచ్చేమో.! కానీ, రాజకీయ ఎత్తుగడలకు సంబంధించి కేసీఆర్‌ని, చంద్రబాబు 'గురు'గా భావిస్తున్నట్లుంది. అందుకే, పార్టీ ఫిరాయింపుల దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ చంద్రబాబు, కేసీఆర్‌నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. 

వాస్తవానికి తెలుగునాట 2014 ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపుల్ని మొదలు పెట్టింది చంద్రబాబే. అయినా, ఆ ఫిరాయింపుల్ని పీక్స్‌కి తీసుకెళ్ళింది మాత్రం కేసీఆర్‌ అని చెప్పక తప్పదు. కేసీఆర్‌ చూపిన బాటలోనే చంద్రబాబు, పార్టీ ఫిరాయింపుల్ని మరింతుధృతం చేశారు. ఇద్దరూ ఈ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్తున్నారు. ఇక, మీడియాపై ఉక్కుపాదం మోపడంలోనూ కేసీఆర్‌ని చంద్రబాబు ఫాలో అవుతున్నారు. తెలంగాణలో ఆంధ్రజ్యోతిపై అనధికారిక బ్యాన్‌కి ఆద్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆంధ్రప్రదేశ్‌లో అదే పని చంద్రబాబు చేస్తున్నారు.. సాక్షి మీడియా విషయంలో. 

తెలంగాణలో కేసీఆర్‌ ఆంధ్రజ్యోతి గ్రూప్‌తోపాటు, టీవీ9 మీదా కన్నెర్రజేశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీవీని కూడా ఓ పట్టు పట్టేశారు సాక్షితోపాటుగా. అనధికారిక బ్యాన్‌ విధించి, తమ ప్రభుత్వానికి ఆ బ్యాన్‌తో సంబంధం లేదని కేసీఆర్‌ ఎలాగైతే వాదించారో, చంద్రబాబు సర్కార్‌ కూడా ఇప్పుడు అదే విధంగా వాదిస్తోంది. హైకోర్టులో సాక్షిపై బ్యాన్‌ విషయమై జరిగిన విచారణకు హాజరైన ప్రభుత్వ తరఫు న్యాయవాది, తమ ప్రభుత్వానికి ఆ బ్యాన్‌తో సంబంధం లేదని తేల్చి చెప్పారు.

మరి, ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి మీడియాపై ఎందుకు బ్యాన్‌ కొనసాగుతున్నట్లు.? ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఓ ఛానల్‌ని బ్యాన్‌ చేసే అవకాశమెలా వుంటుంది.? పైగా మంత్రులు, స్వయంగా 'మీడియాని నియంత్రించే హక్కు మాకుంటుంది. సున్నితమైన పరిస్థితుల్లో ఉద్రిక్తతలకు తావివ్వకుండా మీడియాపై నియంత్రణ చేపడుతుంటాం..' అని ఎలా స్టేట్‌మెంట్‌ ఇవ్వగలుగుతారు.? ఇదంతా చేసి, సాక్షిపై అనధికారిక బ్యాన్‌ విషయంలో తమ ప్రమేయం లేదని ప్రభుత్వమెలా చెప్పగలుగుతుంది.? అంతా హంబక్‌. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి. ఈ విషయంలోనూ కేసీఆర్‌ని చంద్రబాబు ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు. 

తెలంగాణలో ఏబీఎన్‌పైనా టీవీ9పైనా బ్యాన్‌ వున్నప్పుడు ఆయా మీడియా సంస్థలకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పసుపుదళం ఉద్యమబాట పట్టింది. ఇప్పుడు అదే పసుపుదళం ఆంధ్రప్రదేశ్‌లో మీడియాని ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ఇదే మరి, చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతమంటే.

Show comments