సినిమాలకు ఒకసారి టీజర్ విడుదల, మళ్లీ ట్రైలర్ విడుదల, మేకింగ్ వీడియోల విడుదల, అతి భారీ స్థాయిలో ఆడియో విడుదల.. ఇంత హడావుడి చేసేది ఎందుకు.. ఆ సినిమా మీద ప్రజల్లో విపరీతంగా అంచనాలు పెంచడానికి ! దానికోసం ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురుచూసేలా చేయడానికి! అలాంటి సందర్భాల్లో ప్రజల అంచనాలకు సినిమా ఏ కొంచెం తేడాగా ఉన్నా.. అత్యంత దారుణంగా అట్టర్‌ఫ్లాప్ అవుతుంది. పెద్ద పెద్ద హీరోల కోట్ల రూపాయల సినిమాలు అనేకం బాక్సాఫీసు వద్ద ఇలాగే బోల్తా కొట్టాయి.
ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని రాజకీయాలకు అనువర్తింపజేసుకుని చూస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా వ్యవహారం అలాగే కనిపిస్తోంది. ప్రత్యేకహోదా కాకపోవచ్చు గానీ.. ప్రత్యేక ప్యాకేజీ గ్యారంటీ.. అది కాస్తా హోదాను మరపించే అంత గొప్ప ప్యాకేజీగా ఉంటుందని కొన్ని రోజులుగా నాయకులంతా పదేపదే ఊదరగొడుతున్నారు.
ఒకవైపు ఢిల్లీనుంచి వచ్చిన లీకులు పుచ్చుకుని.. పచ్చమీడియా పత్రికలు.. అపూర్వమైన ప్యాకేజీ ఎంత బీభత్సంగా ఉండబోతున్నదో రకరకాలుగా వర్ణిస్తూ.. ఆ ప్యాకేజీని అంత బీభత్సంగా సాధించడానికి మన వెంకయ్యనాయుడు గారు ఎంత బీభత్సంగా కష్టపడ్డారో అన్యాపదేశంగా జనం బుర్రల్లోకి చొప్పించే ప్రయత్నంచేస్తూ కథనాలు కూడా అందించారు. ఢిల్లీ హైదరాబాదుల మధ్య పదేపదే టూర్లు చేసేసి, మధ్యలో అనుమానాస్పదంగా గవర్నరుతో జరిగిన భేటీని కూడా దీనికే ముడిపెడుతూ.. కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా ప్యాకేజీ గురించి తనకు చేతనైనంత ఆశలు కల్పించారు.
ఏదైతేనేం.. ప్యాకేజీ అనే మాట ఇప్పుడు రాష్ట్రమంతా బాగా వ్యాపించిపోయింది. కేంద్రం ఏదో తవ్వి తలకెత్తేయబోతున్నదని ప్రజలు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఢిల్లీ లీకుల ద్వారా వచ్చిన కథనాలను బట్టి, రెవిన్యూలోటు, వెనకబడ్డ జిల్లాలకు సాయం, అమరావతి నిర్మానానికి సాయం, పోలవరం నిర్మాణానికి నిదులు ఇవన్నీ కొత్త విషయాలు కావు. ఎటూ జరుగుతున్నవే. ప్యాకేజీ ముసుగులో మభ్యపెట్టలేకపోయినా.. కేంద్రం ఎటు తిరిగీ చేయాల్సినట్టివే. కాకపోతే.. పారిశ్రామిక రాయితీల మొత్తాన్ని పరిశ్రమల ప్రోత్సాహక నిధి కింద ఇస్తాం అన్నారు. ఇది కొత్తది. హోదాకు ప్రత్యామ్నాయం వంటిది. దీనిలో ఎంత ఉదారంగా ఉంటారనేది వేచిచూడాలి.
ఇంత భారీగా ప్యాకేజీ గురించి జనంలో ఏర్పడిన తర్వాత.. వారు అందించే సాయంలో ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా.. అటు మోడీ సర్కారును, వారి కొమ్ముకాసే రాష్ట్ర భాజపా నాయకుల్ని ప్రజలు తూర్పారపడతారన్నది గ్యారంటీ. సామరస్యంగా సాధించాలి తప్ప.. ఘర్షణకు దిగకూడదు, గట్టిగా అడగకూడదు.. అని చిలకపలుకులు పలుకుతూ సొంత పార్టీనే కాదు రాష్ట్ర ప్రజల్ని ఇన్నాళ్లూ మోసగించినందుకు చంద్రబాబు కూడా దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అని విశ్లేషకులు భావిస్తున్నారు.