‘కమ్మ’ ని రాజ్యంలో బీసీల ఉక్కిరిబిక్కిరి..!

వాస్తవాలు మాట్లాడుకుంటే… రాష్ట్రంలో ఒక కుల రాజ్యం నడుస్తోందనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఆఖరికి పార్ట్ టైమ్ గా రాజకీయాల గురించి మాట్లాడే తెలుగుదేశం పార్టీ మిత్రపక్ష నేత, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇదే మాటే అన్నాడు. ఒక కులం బాగోగులకే చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని, ఆ కులం కోసమే చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అనిపిస్తోందని పవన్ కల్యాణ్ ఇది వరకూ వ్యాఖ్యానించాడు. మరి మిత్రపక్ష నేతకే ఇలాంటి అభిప్రాయం కలిగిందంటే.. చంద్రబాబును అడుగడుగునా కాచుకుంటున్న పవన్ కల్యాణే ఈ మాట మాట్లాడాడు అంటే… పరిస్థితి ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

అధికారంలోకి వస్తూ వస్తూనే.. జరిగిన నియామకాలతో మొదలు, అనధికారికంగా అధికారం చెలాయిస్తున్న వారి వరకూ ఒకే కులం వారు కావడం, ఇక తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్న కులం వారు.. తమ రాజ్యం వచ్చిందని రంకెలు వేయడం, మన కుల రాజ్యమే ఉండాలి.. మా రక్తం గొప్పది, మన కులం వాళ్లు అసలు రక్తదానమే చేయొద్దు.. మీరు చేశారంటే, మన రక్తం ఎక్కించుకుని వేరే కులాల వారు బాగుపడిపోతారు.. అని విషం చిమ్మే మాటలు మాట్లాడటంతో.. ముసుగులో గుద్దులాట లేకుండా ‘కమ్మ’ కులం ఏపీని తమ రాజరిక రాజ్యంగా ఫీలవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే.. తమ కుల రాజ్యం నడుస్తోందని కొంతమంది కమ్మ వాళ్లు ఫీలవుతున్నారు. దాన్నే బయటకు చెప్పుకొంటున్నారు. ఇప్పుడు కూడా సామాన్య, బీద కమ్మ వాళ్లకు ఒరిగేదేమీ లేదు. కానీ కులం పేరుతో రౌడీయిజం, పెత్తనాలు చెలాయించే వాళ్లకు, మా కులం అధికారంలో ఉండాలనే గజ్జి ఉన్న వాళ్లకు తప్ప.. సామాన్య కమ్మ కులస్తుల పరిస్థితి మిగతా కులాల్లోని సామాన్యుల వలె ఉన్నది.

ఈ సంగతులిలా ఉంటే.. కుల మత్తులో, కులం కుళ్లులో కూరుకుపోయి.. తెలుగుదేశం పార్టీ తమ మూలాలను మరిచిపోతోందేమో అనే అభిప్రాయం కలుగుతుంది కొన్ని కొన్ని పరిణామాలను గమనిస్తే. కేవలం కమ్మ కులస్తుల వల్ల మాత్రమే, వాళ్ల ఓట్లతో మాత్రమే  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. అసలు.. తెలుగుదేశం పార్టీ తరపున క్రియాశీలంగా పని చేసే వాళ్లలో కమ్మ వాళ్ల శాతం చాలా చాలా తక్కువ! 

ఉదాహరణకు రాయలసీమ పరిస్థితిని ప్రస్తావించుకోవచ్చు. ఇక్కడ బీసీలు లేకపోతే.. తెలుగుదేశం పార్టీ జీరో! రాయలసీమ సామాజిక పరిస్థితులను అనుసరించి.. బీసీలు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిలబడ్డారు. ఎన్టీఆర్ పై వీరికి వీరాభిమానం. అదే వీరాభిమానం.. తెలుగుదేశం పార్టీపైనా నిలిచింది. అందుకు తగ్గట్టుగా.. ఒకప్పుడు తెలుగుదేశంలో బీసీ సామాజికవర్గ నేతలకు బాగానే ప్రాధాన్యత లభించింది. అయితే అదంతా ఒకప్పుడు!

Readmore!

ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంతమంది బీసీ నేతలకు మంత్రి పదవులు ఇచ్చినా.. వాళ్ల మాట చెల్లడం లేదు. ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవి ఇచ్చినా.. కనీసం  ఆర్ఐ లను బదిలీ చేసుకునేంత శక్తి కూడా లేకుండా పోయింది. బీసీ నేతలకు ప్రాధాన్యత కరువవ్వడం ఎంత వాస్తవమో, ‘కమ్మ’ అనే అర్హతతో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను కనుసన్నల్లో నడిపిస్తున్న వారి ఆధిపత్యం కూడా అంతే వాస్తవం.

అనంతపురం వంటి జిల్లాలో అయితే.. ఓట్లు బీసీలవి, సీట్లు కమ్మ వారికి, పార్టీ కోసం కష్టపడేది బీసీలు.. అజమాయిషీ చెలాయించేది మాత్రం కమ్మ వాళ్లు అనే పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని రీతిలో ఆ ఒక్క జిల్లాలోనే ఐదు మంది కమ్మ ఎమ్మెల్యేలు,  ఇదే కులానికి చెందిన ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. అయితే.. జిల్లాలో వీరి జనాభా శాతంతో పోలిస్తే, వీరి సంఖ్య చాలా చాలా ఎక్కువ!

కురుబ, బోయ… వంటి వర్గాలకు దక్కాల్సిన సీట్లు, గతంలో ఈ కులాల వారు ప్రాతినిధ్యం వహించిన సీట్లలో.. కమ్మ నేతలు పాగా వేశారు. మరి ఎమ్మెల్యే పదవుల విషయం అలా ఉంటే, మిగతా పదవుల విషయంలో కూడా కమ్మ ఆధిపత్య యత్నాలు పతాక స్థాయికి చేరాయిప్పుడు.

మంత్రి పరిటాల సొంత నియోజకవర్గం రాప్తాడు పరిధిలోకి వచ్చే కనగానపల్లి ఎంపీపీ పదవి విషయంలో తెలుగుదేశం వ్యవహరించిన తీరు విస్మయాన్నే కలిగిస్తోంది. అక్కడ ఎటు తిరిగి కమ్మ కులానికి చెందిన వ్యక్తిని మండల పరిషత్ చైర్మన్ గా కూర్చోబెట్టడానికి జరిగిన యత్నం .. నిస్సిగ్గుగా చేసిన కుల రాజకీయమని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి.

11 ఎంపీటీసీ సభ్యులుండే ఈ మండలంలో వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సంపాదించింది. ఆరు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్- ఐదు స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది. అయితే.. ఎంపీపీ ఎన్నిక సమయానికి వైకాపాలోని ఇద్దరిని తెలుగుదేశం తన వైపుకు తిప్పుకుంది. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అప్పట్లో ఒక బీసీ ఆ పదవిని చేపట్టాడు. అయితే.. పార్టీ ఎంపీటీసీ సభ్యుల్లోని ఒక కమ్మ వ్యక్తిని ఎంపీపీ పదవిలో కూర్చోబెట్టాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. మంత్రి పరిటాల సునీత అండదండలతో.. రెచ్చిపోయి, పదవిలో ఉన్న వ్యక్తి చేత రాజీనామా చేయించి, కమ్మ కులానికి చెందిన ఎంపీటీసీని ఎంపీపీగా చేసే యత్నాలు మొదలయ్యాయి.

ఉన్న ఫలంగా ఎంపీపీ స్థానంలోని వ్యక్తిని తొలగించడం, కేవలం కమ్మ వ్యక్తిని ఎంపీపీగా కూర్చోబెట్టాలని మాత్రమే! అసలు తెలుగుదేశానికి బలమే లేని చోట, ఫిరాయింపు ఎంపీటీసీలను అడ్డం పెట్టుకుని ఎంపీపీ స్థానాన్ని సంపాదించుకున్న చోట..  మళ్లీ కెళుక్కొంటూ, కమ్మ వ్యక్తిని ఎంపీపీగా కూర్చోబెట్టారు!

దీంతో.. రాజీనామా చేసిన ఎంపీపీతో సహా అందరికీ ఒళ్లు మండింది. అంతా ఒక కులానికే దక్కాలా, ఎమ్మెల్యే పదవుల దగ్గర నుంచి ఎంపీపీ పదవుల వరకూ అన్నీ మీకేనా.. అని వాళ్లు అడ్డం తిరిగారు. ఏకంగా ముగ్గురు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ మూలాలు బీసీల మీద ఆధారపడి ఉన్నాయి. వాళ్ల ఓట్లు లేకపోతే.. అనంత వంటి జిల్లాలో తెలుగుదేశం గట్టెక్కడం కలలో మాట! మరి ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. ఎంతసేపూ ఒక కుల రాజ్యమే ఉండాలి, బీసీలు ఓట్లేయాలి- కమ్మలు రాజ్యం ఏలాలి.. అనే రాజకీయాలు మాత్రం ఆ పార్టీ పుట్టిని ముంచుతాయని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు!

Show comments