ప్రియాంక మాటే మంత్రమవుతుందా?

కాంగ్రెసు పార్టీ ముందున్న ఒకే ఒక లక్ష్యం వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ పతాకం ఎగురవేయడం. రాజకీయంగా కీలక రాష్ట్రమైన యూపీలో జయాపజయాలు ఏ పార్టీ భవిష్యత్తునైనా నిర్దేశిస్తాయి. యూపీలో ఫలితాలు కేంద్రంలో అధికార రాజకీయాలను ప్రభావితం చేస్తాయనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగానే 2019లో కేంద్ర అధికార పీఠం ఎవరికి దక్కుతుందనేది అంచనా వేయొచ్చు. గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు కాంగ్రెసు పార్టీ గ్రహచారం బాగాలేదు. దాని వైఫల్యాలకు అనేక కారణాలున్నాయి.

 కాని ఆ కారణాలు విశ్లేషించుకోవడంకంటే నాయకుల స్థానాలను మార్చడానికి, ఒకరి బాధ్యతలు మరొకరికి అప్పగించడానికే అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెసు పార్టీలో ఇది మామూలే. రాష్ట్రాల్లో అపజయాలు ఎదురుకాగానే పీసీసీ అధ్యక్షులను, పార్టీ ముఖ్యమంత్రులను మార్చడం కాంగ్రెసు పార్టీ ఆనవాయితీ. నాయకులను పదవుల నుంచి తప్పించడం లేదా వారి బాధ్యతలు మార్చడం కారణంగా విజయం దక్కుతుందని కాంగ్రెసు పార్టీ భావన. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కారణంగా విజయాలు దక్కడంలేదనే అభిప్రాయం పార్టీలోని సీనియర్‌ నాయకుల దగ్గర్నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ఉంది. చాలామంది ఈ విషయం బహిరంగంగానే చెబుతున్నారు. 

తన గురించి నాయకులు ఏమనుకుంటున్నారో రాహుల్‌కూ తెలుసు. ఆయన వ్యూహాలు విఫలమవుతున్నాయి. ఆయన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాయి. పార్టీ వైఫల్యాలకు ఇతరత్రా అనేక కారణాలుండొచ్చు. కాని ఇవి  ప్రధానంగా కనబడుతున్నాయి. రాహుల్‌ వైఫల్యం కారణంగానే యూపీ ఎన్నికల్లో వ్యూహరచన చేయడానికి గత సాధారణ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి మోదీ ప్రధాని కావడానికి కారకుడైన, బిహార్‌ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించి నితీష్‌ కుమార్‌ సీఎం కావడానికి దోహదం చేసిన ప్రశాంత్‌ కిషోర్‌ను కాంగ్రెసు తన వ్యూహకర్తగా తెచ్చుకుంది. 

ఇక ప్రసంగాలతో, మాటల మాయాజాలంతో ఓటర్లను ఆకట్టుకునే వ్యక్తి ఎవరు? రూపంలో ఇందిరా గాంధీని తలపించేలా ఉన్న సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ. గతంలో పలుమార్లు తల్లి, సోదరుడి నియోజకవర్గాలైన రాయబరేలి, అమేథీలో ఆమె ప్రచారం చేసింది. అయితే ఆమె ప్రచారం కారణంగానే తల్లి, సోదరుడు విజయాలు సాధిస్తూ రాలేదు. ఆ రెండు నియోజకవర్గాలు నెహ్రూ-గాంధీ కుటుంబానికి పట్టుగొమ్మలు. దేశమంతా కాంగ్రెసు ఓడిపోయినా ఆ రెండు చోట్లా గ్యారంటీగా గెలుస్తుంది. 

అక్కడ ప్రియాంక ప్రచారం చేసినా చేయకపోయినా ఏమీ తేడా ఉండదు. ఇప్పుడు కావల్సింది యూపీలో అధికారంలోకి రావడం. అందుకు ప్రియాంక బలమైన సాధనంగా ఉపయోగపడుతుందని కాంగ్రెసు నాయకులు నమ్ముతున్నారు. ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కాని దానిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ప్రస్తుతానికైతే ప్రియాంక రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలనే నిర్ణయం జరిగింది. కీలక ప్రచారకర్త ఆమే. రాష్ట్రవ్యాప్తంగా 155 బహిరంగ సభల్లో ప్రసంగిస్తుందని నాయకులు చెబుతున్నారు. 

గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఉనికిని కాపాడేందుకు వైఎస్‌ జగన్‌ సోదరి ఎలాగైతే విస్తృతంగా పర్యటించి ప్రసంగించిందో అదే తరహాలో ప్రియాంక ప్రసంగాలు చేయబోతోంది. ఆమె మాటలు మంత్రం కావాలి. ఓటర్లను సమ్మోహితులను చేయాలి. బీజేపీ, ఇతర పార్టీల్లోని దిగ్గజ వక్తలను మట్టికరిపించేలా ఉపన్యాసాలు చేయాల్సివుంటుంది. కేవలం ప్రసంగాలు చేస్తే చాలదు. బాడీ లాంగ్వేజ్‌, హావభావాలు ప్రజలను ఆకట్టుకోవాలి. ఈ పెద్ద బాధ్యతను మోయడానికి ప్రియాంక సంసిద్ధమవుతుండొచ్చు. పార్టీ ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో ఆమె రాజకీయ సవాలును స్వీకరించక తప్పదు. 

Show comments