జగన్ దూకుడు కలిసొచ్చింది : తెదేపా సంబరం!

తమ అధినేత చంద్రబాబునాయుడును నడిరోడ్డు మీద నిల్చోబెట్టి కాల్చినా సరే తప్పులేదంటూ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన రెడ్డి అంటే అని ఉండవచ్చు గాక.. కానీ ఆయనలోని ఆ దూకుడు ఇప్పుడు తమకు వరంలా మారిందని తెలుగుదేశం శ్రేణులు సంబరపడిపోతున్నాయి.

ఇప్పుడు తాము ఇక జగన్ చేసిన ఇతర ఆరోపణల్లో వేటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండాపోయిందని.. ఈ ఒక్కమాటనే పట్టుకుని కొన్ని నెలల పాటూ, కనీసం నంద్యాల ఉప ఎన్నిక పర్వం ముగిసే వరకూ రోజులు నెట్టేయవచ్చునని తెలుగుదేశం నాయకులు సంబరపడిపోతున్నారు. తమలో తాము జగన్ తమకు- ఈ దూకుడు ద్వారా చాలా మేలు చేశాడని మాట్లాడుకుంటున్నారు. 

వైఎస్ జగన్మోహన రెడ్డి ఆవేశపరుడైన రాజకీయ నాయకుడు. ఆ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం లేదు. తనలో ఉండే ఆవేశాన్ని ఆయన దాచుకునే ప్రయత్నం కూడా ఎన్నడూ చేయలేదు. కొమ్ములు తిరిగిన సీనియర్ నాయకులు కూడా సోనియా భజన చేసుకుంటూ.. కాలం గడిచిపోతే చాలునని భావించే కాంగ్రెస్ పార్టీలో, సోనియా వద్ద తనకు అవమానం జరిగిందనే ఆవేశంతో.. పార్టీనుంచి బయటకు వచ్చి... తన తండ్రి పేరిట సొంత పార్టీని స్థాపించుకున్న వ్యక్తి జగన్.

అలాంటి జగన్ నంద్యాల ఉప ఎన్నిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా తప్పే. కానీ.. ప్రజలకు ద్రోహం చేయడంలో, ఇచ్చిన మాట తప్పడంలో చంద్రబాబు తీరు గురించి చెబుతూ ఆ ఆవేశంలో ఆయన హద్దులు మరచిపోయారు. అందుకు ఆయన, కనీసం ఎన్నికల సంఘానికి వివరణ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. జగన్ ఆవేశం ఆయనకు మేలు చేసిందో, చేటు చేసిందో తెలియదు గానీ.. తెలుగుదేశం పార్టీకి మాత్రం చాలా మేలు చేసిందనే చెప్పాలి. 

ఈ మాటను జగన్ అన్నప్పటినుంచీ.. జగన్ అంటే ఒక రాక్షసుడు, హింసాప్రవృత్తి గలవాడు, ఫ్యాక్షనిస్టు, నేరస్తుడు ఇలా రకరకాల మాటలతో ఆయనను తిట్టని తెలుగుదేశం నాయకుడు అంటూ రాష్ట్రంలో లేడు. పైగా దిష్టిబొమ్మలు తగలబెట్టడం వంటి దుశ్చర్యలకు కూడా పాల్పడుతున్నారు. జగన్ మాటల్లో అంటే.. తెదేపా వారు చేతల్లో చేసి చూపెడుతున్నారు. 

అయితే తెదేపా నాయకులు జగన్ మాటల గురించి సంబర పడుతున్నది ఎందుకంటే.. ఈ ఒక్క మాటను పట్టుకుని జగన్ ను విలన్ గా చిత్రీకరించవచ్చుననేది వారి ఆలోచన. పైగా పరిపాలనలో వైఫల్యాల గురించి ప్రజలకు చేస్తున్న ద్రోహాల గురించి జగన్ చేసిన నిర్మాణాత్మక ఆరోపణల్లో వేటికీ సమాధానం చెప్పకుండానే.. ఈ ఒక్క మాట మీద జగన్ ను నిందిస్తూ.. ఈ ఎన్నికల గండం దాటేయవచ్చునని కూడా వారు మురిసిపోతున్నారు. 

అందుకే రోజులు గడచిపోతున్నప్పటికీ కూడా.. తెలుగుదేశం నాయకులు మాత్రం.. జగన్ మాటల మంటలను చల్లారనివ్వడం లేదు. ఆ మంట చల్లారి పోతే.. తమ పబ్బంగడవదని వారికి మరింత భయం కలుగుతున్నట్లుగా ఉంది. అందుకే పదేపదే ప్రతోజూ జగన్ అన్నమాటలను వారికి వారే పునశ్చరణ చేస్తూ.. ఆ ఒక్క మాటను పట్టుకుని, ఒక్క నాయకుడి మీద పదేపదే ఆడిపోసుకుంటున్నారు.

అయితే జనం అంత వెర్రి బాగుల వాళ్లా అనే ప్రశ్న ఇక్కడ చాలా మందిలో తలెత్తుతోంది. జగన్ చేసిన అసలు సిసలు ఆరోపణల గురించి సమాధానం ఇవ్వకుండా.. ఆయన మీద నిందలు వేసుకుంటూ పోతే.. జనం పచ్చ వ్యూహాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా అనేది పలువురికి కలుగుతున్న సందేహం.

Show comments