రెండున్నర లక్షల కోట్లు: వెంకయ్య మారరు

మాజీ కేంద్ర మంత్రి, ఉపరాష్ట్రపతిగా ఇటీవల గెలుపొందిన వెంకయ్యనాయుడు, ఇంకా రెండున్నర లక్షల కోట్ల జపం మాత్రం మానడంలేదు. ఆంధ్రప్రదేశ్‌కి తాను రెండున్నర లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్లు వెంకయ్యనాయుడు తాజాగా సెలవిచ్చారు. కేంద్రమేమో, గట్టిగా 50 వేల కోట్ల రూపాయలు కూడా ఇచ్చినట్లు చెప్పడంలేదాయె. వెంకయ్యనాయుడు మాత్రం, 'పాడిందే పాటరా డాష్‌ డాష్‌' అన్న చందాన పాత పాటే పాడుతూనే వున్నారు. 

రెండున్నర లక్షల కోట్ల సంగతి దేవుడెరుగు.. గట్టిగా 12 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుని అయినా కేంద్రం పూడ్చిందా.? అన్న ప్రశ్నకు వెంకయ్య దగ్గరే సమాధానం లేదు. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇచ్చిన నిధులెంత.? ఇవ్వాల్సిన నిధులెంత.? ఇవీ సమాధానం లేని ప్రశ్నలే. అయినా, వెంకయ్యనాయుడు రెండున్నర లక్షల కోట్ల నిధుల్ని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చేశారుట. నమ్మితే నమ్మండి, లేకపోతే మీ ఖర్మ.. నేను మాత్రం రెండున్నర లక్షల కోట్ల లెక్క చెబుతూనే వుంటారాయన. 

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఛాన్స్‌ రాగానే, ఇకపై రాజకీయాలు మాట్లాడలేనని చెప్పారు వెంకయ్య. కేంద్ర మంత్రి పదవికీ, బీజేపీకీ రాజీనామా చేసేసిన వెంకయ్యనాయుడు, ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఇంకా పదవీ ప్రమాణ స్వీకారం చేయలేదుగానీ, ఉపరాష్ట్రపతి అయిపోయినట్లే. ఆ లెక్కన, వెంకయ్యనాయుడు తన విశ్వసనీయతను మరింత గట్టిగా చాటుకోవాల్సి వుంది. దురదృష్టవశాత్తూ ఆ హుందాతనమే వెంకయ్యలో కన్పించడంలేదాయె.! 

ఇప్పుడే ఇలా వుంటే, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక కూడా 'రెండున్నర లక్షల కోట్లు నేనే తెచ్చా..' అని చెబుతూనే వుంటారా.? ఏమో, ఆయన తీరు చూస్తోంటే అస్సలేమాత్రం మారేలా కన్పించడంలేదు.

Show comments