బాలకృష్ణ.. ఇక అంతేనా.?

గతంలో హరికృష్ణ.. ఇప్పుడు బాలకృష్ణ.. టీడీపీ అధినేత చంద్రబాబు, బావమరుదుల్ని ఓ ఆట ఆడుకుంటున్నారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ పదవి కొనసాగింపు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత 'బావ' మీద అలిగారు, అలా అలా సర్దుకుపోయారు. మరి, 2019 ఎన్నికల తర్వాత బాలకృష్ణ పరిస్థితేంటి.? ఇదే ఇప్పుడు నందమూరి అభిమానుల ఆందోళనకు కారణమవుతున్న ప్రశ్న. 

పుత్రరత్నం నారా లోకేష్‌కి మంత్రిపదవి ఇచ్చుకున్న చంద్రబాబు, బాలకృష్ణని పక్కన పెట్టేశారు. 'కాబోయే సీఎం బాలయ్య..' అంటూ 2014 ఎన్నికల సమయంలోనే, నందమూరి అభిమానులు నానా హంగామా చేశారు. అయితే, బాలయ్య మాత్రం 'నేనే పదవులకు అలంకారం.. నాకు ఏ పదవీ అలంకారం కాబోదు..' అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేశారు. అలా బాలయ్యని 'ఉబ్బేసి, బజ్జోబెట్టడం' చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్యే. 

బాలయ్యకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఛాన్సిచ్చి, సరిపెట్టేశారు చంద్రబాబు. బాలయ్య ఎమ్మెల్యే అయ్యారుగానీ, మూడేళ్ళుగా అసలెక్కడా పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఉనికి అంతగా లేకుండా జాగ్రత్తపడ్తున్నారు టీడీపీ అధినేత. పార్టీ పగ్గాలు ముందుగా లోకేష్‌కి ఇచ్చి, తద్వారా పార్టీ శ్రేణుల నుంచే లోకేష్‌కి మంత్రి ఇవ్వాలనే డిమాండ్‌ చేయించారు చంద్రబాబు. లోకేష్‌, స్వయానా మేనల్లుడు.. పైగా తన కుమార్తెకి భర్త కావడంతో బాలకృష్ణ కూడా వ్యతిరేకించని పరిస్థితి. 

తెలంగాణలో కేసీఆర్‌, తన కొడుక్కి మంత్రిపదవి ఇచ్చారు.. మేనల్లుడికీ మంత్రి పదవి ఇచ్చుకున్నారు. ఆ లెక్కన బాలయ్యకీ పదవి ఇవ్వాలనుకుంటే అడ్డు చెప్పేదెవరు.? పైగా, మంత్రి పదవుల విషయంలో 'అంతా నా ఇష్టం' అని చెబుతుంటారు చంద్రబాబు. కానీ, బాలయ్యకు మాత్రం ఇవ్వరంతే. మంత్రిపదవి సంగతిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మిగతా నియోజకవర్గాలతో పోల్చితే ఎప్పటికప్పుడు హిందూపురం ప్రత్యేకంగా వార్తల్లోకెక్కుతూ వస్తోంది. పార్టీలో అంతర్గత కలహాలు, స్థానిక ఎమ్మెల్యేపై అసంతృప్తీ అక్కడ చాలా ఎక్కువే. ఇదంతా చంద్రబాబు సృష్టేనన్న వాదనా లేకపోలేదు. 

మొత్తంగా చూస్తే, నాయకుడిగా ఎట్టి పరిస్థితుల్లోనూ బాలయ్యకు ఛాన్స్‌ ఇవ్వకూడదన్న చంద్రబాబు ఆలోచన ఇక్కడ సుస్పష్టంగా కన్పిస్తోంది. తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ రాజకీయ వారసుడిగా పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశమెలాగూ లేదు. పోనీ, మంత్రిపదవి అన్నా దక్కుతుందా.? అంటే అదీలేదు. భవిష్యత్తులో బాలకృష్ణ మరో హరికృష్ణ కావడం ఖాయమంతే.

Show comments