జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ అవతార్ సీక్వెల్ మరోసారి వాయిదాపడింది. లెక్కప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లో అవతార్-2 సందడి చేయాలి. కానీ మరో రెండేళ్లకు పార్ట్-2ను పోస్ట్ పోన్ చేశారు.
జేమ్స్ కామరూన్ తో తుది చర్చలు ముగించిన ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ సంస్థ.. తాజాగా మరోసారి అవతార్ సీక్వెల్స్ డేట్స్ ప్రకటించింది. అవతార్-2ను 2020 డిసెంబర్ 18న విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే పార్ట్-3కి మాత్రం పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. అవతార్-2 వచ్చిన ఏడాది గ్యాప్ లోనే అంటే.. 2021 డిసెంబర్ 17కే అవతార్-3ని విడుదల చేస్తామని ప్రకటించింది.
అవతార్ సీక్వెల్స్ ఇక్కడితో ముగిసిపోలేదు. మరో 2 సీక్వెల్స్ డేట్స్ కూడా ప్రకటించారు. 2024 డిసెంబర్ 20న అవతార్-4 వస్తుందని.. ఇక 2025 డిసెంబర్ 19న అవతార్-5 వస్తుందని ప్రకటించారు. అంటే.. అవతార్ సినిమా వచ్చిన 16 ఏళ్లకు అవతార్-5 వస్తుందన్నమాట.
ఇన్ని విషయాలు ప్రకటించిన అవతార్ టీం మరో 2 విషయాలపై కూడా చిన్న స్పష్టత ఇచ్చింది. 5 భాగాలతో అవతార్ ఫ్రాంచైజీని ఆపాలని అనుకోవడం లేదని ప్రకటించింది. దీంతో పాటు 4,5 భాగాలు చెప్పిన తేదీ కంటే కాస్త ముందే విడుదలయ్యే అవకాశాలున్నాయని కూడా తెలిపింది.